Revenue
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ (Revenue)సేవలు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసి, ప్రజలకు చిక్కుముడులు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రెవెన్యూ(Revenue) శాఖ సమీక్షలో సీఎం తీసుకున్న నిర్ణయాలు భూ యజమానులకు గొప్ప ఊరటనిచ్చే అంశాలు అంటున్నారు ఏపీ వాసులు.
రియల్‌టైమ్‌లో ఆటో మ్యుటేషన్ (Auto Mutation)..సీఎం ఆదేశాలలో అత్యంత కీలకాంశం, పట్టాదారు పాస్ పుస్తకాల సహా అన్ని భూమి లావాదేవీలలో రియల్ టైమ్ ఆటో మ్యుటేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయడం.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే, భూమి యాజమాన్య హక్కుల మార్పు (మ్యుటేషన్) ఆటోమేటిక్‌గా, రియల్‌టైమ్‌లో జరిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.
దీనివల్ల భూ యజమానులు పట్టాదారు పాస్ పుస్తకం కోసం పదేపదే రెవెన్యూ (Revenue) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి పూర్తిగా తొలగిపోతుంది.
భూముల రీసర్వేకు డెడ్‌లైన్..రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిని సమీక్షించిన సీఎం, ఈ ప్రాజెక్టుకు తుది గడువును నిర్దేశించారు.2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
పురోగతి: ప్రస్తుతం 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి కాగా, ఇంకా 10,123 గ్రామాల్లో చేయాల్సి ఉందని అధికారులు నివేదించారు. ప్రతీ నెలా ఈ పురోగతిపై నివేదిక ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు.
పీజీఆర్ఎస్ (PGRS) లో మ్యుటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి 1,97,915 ఫిర్యాదులు సహా, ల్యాండ్ నేచర్, రీసర్వే అనంతరం భూమి తగ్గిందని వచ్చిన దరఖాస్తులు భారీగా నమోదయ్యాయి.
జాయింట్ కలెక్టర్‌కు ఉన్న ‘డిస్ప్యూటెడ్ ల్యాండ్స్’ (వివాదాస్పద భూములు) పరిష్కరించే అధికారాన్ని ఇకపై ఆర్డీవోలకు (RDO) ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. దీనివల్ల స్థానికంగా ఫిర్యాదుల పరిష్కారం వేగవంతం అవుతుంది.
భూ రికార్డుల భద్రత, రెగ్యులరైజేషన్..భూమి వివరాలు ట్యాంపర్ కాకుండా పటిష్టమైన వ్యవస్థను, అవసరమైతే బ్లాక్‌చైన్ (Blockchain) వంటి ఆధునిక టెక్నాలజీని తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. భూముల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పారదర్శకంగా ఉంచడం ద్వారా వివాదాలను తగ్గించవచ్చు.
22ఏ జాబితా నుంచి తమ భూముల వివరాలు తొలగించాలని వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని, ముఖ్యంగా ఎక్స్ సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వారి భూములను ఈ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు.
మున్సిపల్ పరిధిలో ఉన్న 250 చదరపు గజాల లోపు అసైన్డ్ భూములను 50 శాతం బేస్ వాల్యూతో, ఆక్వా కల్చర్ చేస్తున్న భూములను సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం రెగ్యులరైజ్ (క్రమబద్ధీకరించడం) చేయాలని ఆదేశించారు.
రెవెన్యూ లక్ష్యాలు, పౌర సేవలు..స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రూ. 10,169 కోట్ల రెవెన్యూ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
పౌర సేవల్లో భాగంగా, 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాన్ని (Caste Certificate) వెంటనే పొందేలా, మరియు ఆర్టీజీఎస్ (RTGS) తో అనుసంధానించిన సమాచారం ద్వారా ఆదాయ ధృవపత్రాన్ని (Income Certificate) అందించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు.
గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు రెవెన్యూ శాఖకు వచ్చిన 5.28 లక్షలకు పైగా ఫిర్యాదుల్లో 86 శాతం పరిష్కారమయ్యాయని అధికారులు వివరించారు. ఈ ప్రక్షాళన ద్వారా రెవెన్యూ శాఖలో ఏడాదిలోగా పూర్తి పారదర్శకత తీసుకురావాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు.
