caste survey: స్మార్ట్ గవర్నెన్స్ ..ఇంటింటికీ కుల సర్వే

caste survey : అక్టోబర్ 2వ తేదీ నాటికి ఏపీవ్యాప్తంగా కుల ధ్రువీకరణ పత్రాల సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

caste survey : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి తన ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో, పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించే లక్ష్యంతో రెండు కీలక ప్రకటనలు చేసింది. వాటిలో ఒకటి, ఇంటింటికీ వెళ్లి కుల ధ్రువీకరణ పత్రాల కోసం సమగ్ర సర్వే నిర్వహించడం, మరొకటి మహిళలు, పిల్లల సంక్షేమ పథకాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించడం.

caste survey

అక్టోబర్ 2వ తేదీ నాటికి ఏపీవ్యాప్తంగా కుల ధ్రువీకరణ పత్రాల సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సుమోటో విధానం ద్వారా, పౌరులు తమ కుల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వం ఇంటి వద్దకే వచ్చి వివరాలు సేకరిస్తుంది. ఈ మెగా సర్వేలో రియల్‌ టైం గవర్నెన్స్‌ సొసైటీ , పౌర సరఫరాలు, గ్రామ/వార్డు సచివాలయాలు, రెవెన్యూ శాఖలు కలిసికట్టుగా పనిచేస్తాయి. గతంలో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వివరాలను మాత్రమే సేకరించగా, ఈసారి ఓసీ కులాల సమాచారాన్ని కూడా నమోదు చేస్తారు.

ఈ సర్వే కోసం, ప్రభుత్వ శాఖల వద్ద ఇప్పటికే ఉన్న సమాచారాన్ని ఒక సమగ్ర డేటాబేస్‌గా రూపొందిస్తున్నారు. ఈ వివరాలను వీఆర్వోల లాగిన్‌లకు పంపించి, వారు ఇంటింటికి వెళ్లి ఆ డేటా ఆధారంగా వివరాలను ధృవీకరించి సేకరిస్తారు. సర్వే ద్వారా సేకరించిన ఈ ప్రామాణిక సమాచారాన్ని ఇతర ప్రభుత్వ శాఖలు కూడా వాడుకుంటాయి.

అంతేకాకుండా, గ్రామ/వార్డు సచివాలయాలు కుల ధ్రువీకరణ పత్రాలను త్వరగా జారీ చేస్తాయి. ఈ పత్రాలు భవిష్యత్తులో ట్యాంపరింగ్ చేయకుండా అంటే ఎలాంటి మార్పులు చేయడానికి వీలు లేకుండా ఉండేందుకు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని ఉపయోగించడం అనేది ఈ ప్లాన్‌లో ఒక ముఖ్యమైన హైలైట్. ఈ కీలక నిర్ణయం ద్వారా కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో సంపూర్ణ స్పష్టత, పారదర్శకత వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

మరో కీలక అడుగుగా, ఏపీలోని మహిళలు, పిల్లల సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 జిల్లాలకు 26 మంది ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ అధికారులను జిల్లా మిషన్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ శక్తి, వాత్సల్య పథకాలను వీరు పర్యవేక్షిస్తారు. ఈ పథకాలు సక్రమంగా, సమర్థవంతంగా అమలయ్యేలా చూసి, లబ్ధిదారులకు పూర్తి ప్రయోజనం చేకూరేలా పర్యవేక్షించడం వీరి ప్రధాన బాధ్యత. ఈ నియామకాలు మహిళలు, పిల్లల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద, ఏపీ ప్రభుత్వం పరిపాలనలో ప్రజలకు మరింత చేరువయ్యేలా, సంక్షేమ పథకాల అమలును బలోపేతం చేసేలా కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతోంది.

 

Exit mobile version