Visakhapatnam
విశాఖపట్నం (Visakhapatnam)పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు సరికొత్త ఆకర్షణగా నిలిచింది. నగరంలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సులను విశాఖ బీచ్ రోడ్డులో జెండా ఊపి ప్రారంభించిన తర్వాత..ఆయన స్వయంగా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రయాణించి ఈ సేవలను పరిశీలించారు.
సగం రేటుకే నగరం మొత్తం చుట్టేయొచ్చు.ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ పర్యాటక బస్సులు పర్యాటకులకు ఒక గొప్ప సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఇవి ఆర్కే బీచ్ నుంచి తొట్ల కొండ వరకు సుమారు 16 కిలోమీటర్ల బీచ్ రోడ్డుపై ప్రయాణించనున్నాయి. పర్యాటకులు 24 గంటల పాటు ఈ బస్సులో ఎప్పుడైనా ఎక్కి, దిగి ప్రయాణించవచ్చు.
నిజానికి ఈ సేవలకు టికెట్ ధర రూ.500గా నిర్ణయించారు, అయితే పర్యాటకుల సౌలభ్యం కోసం దీనిలో సగం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. దీంతో, పర్యాటకులు కేవలం రూ.250 రూపాయలకే 24 గంటల పాటు ఈ బస్సు సర్వీసును ఉపయోగించుకోవచ్చు. ఈ నిర్ణయం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఈ కొత్త బస్సులు విశాఖ పర్యాటక రంగానికి ఒక కొత్త జీవనాన్ని తీసుకొచ్చాయి.ఈ బస్సుల ప్రారంభంతో పాటు, విశాఖపట్నం(Visakhapatnam) భవిష్యత్తుపై ఉన్న ఆశయాలు కూడా మరోసారి గుర్తుకు వచ్చేలా చేసింది. గతంలో విశాఖను రాజధానిగా ప్రకటించినా, ప్రజలు ఆ ప్రతిపాదనను తిరస్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం జరిగింది.
ప్రస్తుతం విశాఖ(Visakhapatnam)ను ఒక ఆర్థిక రాజధానిగా, ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ హబ్‌గా మార్చడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. నగరంలో డేటా సెంటర్ల ఏర్పాటు, సీ కేబుల్ అనుసంధానం ద్వారా విశాఖ ప్రపంచంతో అనుసంధానమవుతుంది. ఇది భారతదేశానికి టెక్నాలజీ హబ్‌గా విశాఖ ఎదుగుదలకు దోహదపడుతుంది.
మహిళలకు విశాఖ ఒక సురక్షితమైన నగరంగా ఎంపిక కావడం ఒక గర్వకారణం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో విశాఖ పోటీ పడుతూ, మహిళలకు సురక్షితమైన చిరునామాగా మారింది. పర్యాటకులు కూడా పర్యావరణ హితంగా వ్యవహరించి, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. ఈ ప్రయత్నాలన్నీ విశాఖను ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే ఒక అద్భుతమైన గమ్యస్థానంగా మారుస్తున్నాయి.