Candidates
మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. జనవరి 28 (నేటి) నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవడంతో నామినేషన్ వేయాలనుకున్న కొంతమందికి కొత్త గుబులు పట్టుకుంది. ఎందుకంటే ఈసారి ఎన్నికల బరిలో నిలవాలనుకునే అభ్యర్థుల(Candidates)కు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అత్యంత కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఎన్నికలలో పోటీ చేయాలంటే కేవలం రాజకీయ పలుకుబడి ఉంటే సరిపోదు, మున్సిపల్ రికార్డుల్లో అభ్యర్థి క్లీన్‌గా ఉండాలని స్పష్టం చేసింది.
ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ( Candidates)తన పేరు మీద కాన తన కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఉన్న ఆస్తులకు సంబంధించి ఎలాంటి పన్ను బకాయిలు ఉండకూడదు. ముఖ్యంగా ఇంటి ఆస్తి పన్ను (Property Tax), నల్లా బిల్లులు (Water Tax) పూర్తిగా చెల్లించి ఉండాలి. నామినేషన్ దాఖలు చేసే సమయంలో సంబంధిత మున్సిపల్ కమిషనర్ నుంచి ‘నో-డ్యూ సర్టిఫికేట్’ సమర్పించడం తప్పనిసరి. ఒక్క రూపాయి బకాయి ఉన్నా సరే నామినేషన్‌ను అధికారులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించే అవకాశం ఉంది.
ఎన్నికల ఖర్చుల విషయంలో పారదర్శకత కోసం ఎస్‌ఈసీ మరో కీలక నిబంధనను పెట్టింది. నామినేషన్ వేయడానికి కనీసం ఒక రోజు ముందు అభ్యర్థి తన పేరు మీద ఒక కొత్త ‘ఎలక్షన్ బ్యాంక్ అకౌంట్’ తెరవాలి. ప్రచారానికి వాడే ప్రతి పైసా ఈ అకౌంట్ నుంచే జరగాలి. పాత అకౌంట్లను వాడటం లేదా పర్సనల్ డబ్బులు వాడటం నిబంధనలకు విరుద్ధం. మున్సిపాలిటీల్లో గ్రేడ్ ఆధారంగా రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వ్యయ పరిమితిని విధించారు.
అలాగే తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం, మే 31, 1995 తర్వాత ..ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారు పోటీ చేయడానికి అనర్హులు. అలాగే గత ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల వివరాలు సమర్పించకుండా అప్పుడు అనర్హత వేటు పడిన సుమారు 3,000 మందికి పైగా అభ్యర్థులు (Candidates) ఈసారి పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి.. ఆశావహులు తమ పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసుకుని బరిలో నిలవాలని అధికారులు సూచిస్తున్నారు.
