TTD: టీటీడీ ఆలయాలకు ఆర్థిక భరోసా.. ఇకపై ప్రతి గుడికి కార్పస్ ఫండ్ ఏర్పాటు!

TTD: శ్రీనివాస మంగాపురం, హైదరాబాద్, చెన్నై వంటి కొన్ని ప్రధాన ఆలయాలు మినహా మిగిలిన 48 ఆలయాలు నిర్వహణ పరంగా ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయి.

TTD

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేవలం తిరుమల శ్రీవారి ఆలయానికే పరిమితం కాకుండా, తన పరిధిలోని డజన్ల కొద్దీ అనుబంధ ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంతో పాటు, ఆ ఆలయాలు ఆర్థికంగా తమ సొంత కాళ్లపై నిలబడేలా విప్లవాత్మక మార్పులకు టీటీడీ బోర్డు శ్రీకారం చుట్టింది.

ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో మొత్తం 61 ఆలయాలు ఉన్నాయి. ఇందులో శ్రీనివాస మంగాపురం, హైదరాబాద్, చెన్నై వంటి కొన్ని ప్రధాన ఆలయాలు మినహా మిగిలిన 48 ఆలయాలు నిర్వహణ పరంగా ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ‘కార్పస్ ఫండ్’ (శాశ్వత నిధి) విధానాన్ని బోర్డు ఆమోదించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా చాలా ఆలయాలకు వచ్చే ఆదాయం కంటే నిర్వహణ ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. హుండీ ఆదాయం తక్కువగా ఉండటం, ఇతర స్థిరమైన ఆదాయ మార్గాలు లేకపోవడమే ఇందుకు కారణం.

ఇప్పుడు టీటీడీ (TTD)తన సాధారణ పెట్టుబడుల నుండి ఒక్కో ఆలయానికి కొంత మొత్తాన్ని కేటాయించి కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ నిధిని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. దానిపై వచ్చే వడ్డీతోనే ఆయా ఆలయాల అర్చకుల వేతనాలు, విద్యుత్ ఛార్జీలు, పారిశుద్ధ్యం మరియు ప్రసాదాల తయారీ వంటి ఖర్చులను భరిస్తారు.

TTD

ఈ వ్యూహం ద్వారా టీటీడీ(TTD)పై భవిష్యత్తులో ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, ఆలయాల నిర్వహణ మరింత మెరుగ్గా ఉంటుంది. భారీ నిర్మాణాలు లేదా అభివృద్ధి పనుల కోసం మాత్రం టీటీడీ తన ఇంజినీరింగ్ బడ్జెట్ నుండి నిధులు సమకూరుస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ఆలయానికి భక్తుల తాకిడి పెరిగి, హుండీ ఆదాయం ద్వారా అది లాభాల్లోకి వస్తే, టీటీడీ తాను ఇచ్చిన కార్పస్ నిధిని దశలవారీగా వెనక్కి తీసుకుంటుంది. దీనివల్ల ఆ నిధిని మళ్ళీ మరో అవసరమైన ఆలయానికి కేటాయించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కపిలేశ్వరస్వామి వంటి ప్రముఖ ఆలయాలు కూడా టీటీడీ ఆర్థిక చేయూతపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే, 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ఆలయాలన్నీ సొంతంగా బడ్జెట్‌ను రూపొందించుకునే స్థాయికి చేరుకుంటాయి.

2026 జనవరి 31 లోపు ఈ కార్పస్ ఫండ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్ణయం వల్ల టీటీడీ అనుబంధ ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో పాటు ఆర్థిక క్రమశిక్షణను కూడా అలవరుచుకోనున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version