Copper
ఆర్థిక మార్కెట్‌లో పెట్టుబడి అంటే కేవలం బంగారం లేదా వెండి మాత్రమే అని భావించే వాళ్లకు ఇప్పుడు రాగి (Copper)కొత్త ఆశలు రేపుతోంది. 2026వ సంవత్సరంలో రాగిపై చేసే పెట్టుబడి దాదాపు 15 నుంచి 25 శాతం వరకు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర సుమారు ఒక లక్షా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు, కిలో వెండి ధర నాలుగు లక్షల రూపాయలకు చేరువలో ఉంది.
అయితే కేజీ రాగి(Copper) ధర కేవలం తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద ఉండటం వల్ల, చిన్న , మధ్యతరహా పెట్టుబడిదారులకు ఇది ఒక గొప్ప అవకాశంగా కనిపిస్తోంది. రాగి ధరలు పెరగడానికి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులే కారణం అంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్, ఎన్వీడియా వంటి సంస్థలు నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్లకు రాగి అవసరం గతంలో కంటే ఇప్పుడు మరింత రెట్టింపు అయింది.
దీనికి తోడు పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ వైపు ప్రపంచం అడుగులు వేస్తూ ఉండటం కూడా రాగి డిమాండ్‌ను పెంచుతోంది. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తయారీకి దాదాపు ఎనభై కేజీల రాగి అవసరం అవుతుంది అంటేనే, భవిష్యత్తులో ఈ లోహానికి ఎంతటి గిరాకీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక భారత్ విషయానికి వస్తే, రాగి తవ్వకాల్లో ఏకైక ప్రభుత్వ దిగ్గజ సంస్థ అయిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ పెట్టుబడిదారులకు హాట్ ఫేవరెట్‌గా మారింది. ఈ సంస్థ షేర్ ధర గతేడాది కాలంలో సుమారు 230 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2025 జనవరిలో కేవలం 229 రూపాయల వద్ద ఉన్న ఈ షేరు, 2026 జనవరి నాటికి 760 రూపాయలకు చేరుకుని సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది
కేవలం ప్రభుత్వ అండ ఉండటమే కాకుండా, ఈ కంపెనీ ఆదాయంలో 95 శాతం రాగి నుండే వస్తుండటం దీనికి ప్రధాన బలం అంటున్నారు నిపుణులు. కంపెనీ ఆర్థిక ఫలితాలను గమనిస్తే, ప్రతి త్రైమాసికంలోనూ ఆదాయం , నికర లాభం స్థిరంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా 2026 రెండో త్రైమాసికంలో ఆదాయ వృద్ధి గతేడాదితో పోలిస్తే ఇరవై శాతం కంటే ఎక్కువగా ఉండటం ఈ సంస్థ పటిష్టతను చాటిచెబుతోంది. వేదాంత, హిందాల్కో వంటి ఇతర లోహ సంస్థలతో పోలిస్తే, ప్యూర్ కాపర్ ప్లేగా హిందుస్థాన్ కాపర్ వైపు మొగ్గు చూపించడమే లాభదాయకమని విశ్లేషకులు సూచిస్తున్నారు.
అయితే పెట్టుబడి పెట్టే ముందు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరమని అంటున్నారు. ప్రస్తుతం హిందుస్థాన్ కాపర్ షేరు ధర దాని అసలు విలువ కంటే ఎక్కువ ధరలో (ఓవర్ వాల్యూడ్) ఉన్నట్లు పి/ఈ రేషియో సూచిస్తోంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో చైనా నుంచి వచ్చే పోటీ, ప్రపంచ ఆర్థిక మాంద్యం వంటి అంశాలు కూడా రాగి ధరలను ప్రభావితం చేయొచ్చు.
కాబట్టి పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో పది నుంచి ఇరవై శాతం వరకు మాత్రమే రాగి షేర్లకు కేటాయించడం మంచిది. రాబోయే రోజుల్లో హిందుస్థాన్ కాపర్ షేర్ తొమ్మిది వందల రూపాయల మార్కును చేరుకునే అవకాశముందని గోల్డ్‌మన్ సాచ్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఆరు వందల యాభై రూపాయలను స్టాప్ లాస్‌గా ఉంచుకుని దీర్ఘకాలిక లక్ష్యంతో అడుగులు వేయడం మంచిది. బంగారం ఎప్పుడూ ఒక సురక్షితమైన పెట్టుబడి. అయితే రాగి అనేది వేగంగా వృద్ధి చెందే ఒక గొప్ప అవకాశంగా నిలవబోతోంది.
KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు..తెలంగాణ రాజకీయాలలో రేపు ఏం జరగబోతోంది?
