RBI
భారతదేశం తన యువశక్తితో ప్రపంచాన్ని శాసిస్తుందని ఇప్పటి వరకూ మనమంతా అనుకుంటున్న ఈ సమయంలో, తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI ) తన ‘స్టేట్ ఫైనాన్సెస్ 2025-26’ నివేదిక ద్వారా తెలుగు రాష్ట్రాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఊహించిన దానికంటే వేగంగా వృద్ధాప్యం వైపు పయనిస్తున్నాయని రిపోర్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం ముఖ్యంగా సంతానోత్పత్తి రేటు (TFR) 1.5 శాతానికి పడిపోవడమనేది భవిష్యత్తులో జనాభా సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదాన్ని సూచిస్తోంది.
తెలంగాణలో 2016లో కేవలం పది శాతంగా ఉన్న అరవై ఏళ్లు పైబడిన వారి జనాభా, 2036 నాటికి పదిహేడు శాతానికి చేరుకోబోతోంది . అంటే మరో పదేళ్లలో తెలంగాణ పూర్తిగా ఏజింగ్ స్టేట్ లిస్టులోకి చేరుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 2036 నాటికి దేశంలో అత్యధికంగా వృద్ధులు ఉండే రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానానికి చేరుకోబోతోంది. ఇది కేవలం సామాజిక మార్పు మాత్రమే అయితే ఇదంత పెద్ద విషయం కాదు. ఇది రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పడబోయే పెను భారం కాబోతుండటమే హాట్ టాపిక్ అవుతోంది.
జనాభాలో మార్పుల వల్ల ..పనిచేసే వయసు గల జనాభా మెల్లగా తగ్గిపోవడం, ఆధారపడే వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం పనిచేసే ప్రతి వంద మందిపైన.. ఆధారపడే వృద్ధుల సంఖ్య ఇరవై వరకు ఉన్నా, 2036 నాటికి ఇది ఇరవై ఆరుకు చేరుకుంటుందట.
దీనివల్ల పెన్షన్ల భారం సుమారు 50 వేల కోట్ల రూపాయలకు పైగా పెరగడం కాకుండా..వైద్య ఖర్చులు బడ్జెట్‌లో 30 శాతం వాటాను ఆక్రమించే అవకాశం ఉండనుంది. దీనివల్ల ఐటీ ,తయారీ రంగాల్లో ఐదు లక్షల వరకు ఉద్యోగ ఖాళీలు ఏర్పడి, లేబర్ షార్టేజ్ వచ్చే ప్రమాదం కూడా ఏర్పడుతుంది.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆర్‌బీఐ (RBI ) కొన్ని కీలక పరిష్కారాలను సూచించింది. ప్రభుత్వాలు వెంటనే స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను వేగవంతం చేయాలి. యువతకు ఏఐ, ఎలక్ట్రిక్ వాహనాలు , సోలార్ వంటి భవిష్యత్తు రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉత్పాదకతను పెంచాలి. అలాగే ప్రభుత్వాలే కాకుండా, సామాన్య ప్రజలు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆర్బీఐ చెబుతోంది.
సంతానోత్పత్తిని పెంచడం ద్వారా జనాభా స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ పెరుగుతోంది. ప్రభుత్వం కూడా సంతానోత్పత్తిని ప్రోత్సహించేలా చైల్డ్ కేర్ సబ్సిడీలు, పదివేల రూపాయల వరకు ఇన్సెంటివ్స్ , తల్లులకు పేరెంటల్ లీవ్ వంటి ప్రోత్సాహకాలు అందించాలి. మరోవైపు, పెరుగుతున్న వృద్ధ జనాభాకు అవసరమైన హోమ్ నర్సింగ్ , ఇన్సూరెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలి.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలు తమ వద్ద ఉన్న యువ డైవిడెంట్‌ను వాడుకోవడానికి 2026 నుంచి 2036 మధ్య కాలమే చివరి అవకాశంగా చెప్పొచ్చు. ఈ పదేళ్లలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే, జపాన్ వంటి దేశాలు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక స్తబ్దత మనకూ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Copper:బంగారం, వెండి కొనొద్దా? ఎర్ర బంగారం కొనడానికి ఇదే రైట్ టైమా?
