హైదరాబాద్ నగరం రోజురోజుకు సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. ముఖ్యంగా వాట్సప్(WhatsApp) వేదికగా సాగుతున్న స్టాక్ మార్కెట్ మోసాలు ప్రజల జీవితాలను రోడ్డున పడేస్తున్నాయి.
గతేడాది తొలి 8 నెలల్లోనే రూ. 372 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు, అంతకుముందు సొమ్ముతో కలిపి ఏకంగా రూ. 976 కోట్లను సామాన్యుల నుంచే దోచుకున్నారు.2025లో నగరవాసులు కోల్పోయిన సొమ్ము రూ. 500 కోట్లకు పైగానే ఉందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సైబర్ ముఠాలు మొదట ప్రముఖ కంపెనీల ఐపీఓ (IPO) పేర్లతో వాట్సప్ (WhatsApp)లింకులను పంపిస్తాయి. ఈ లింక్ క్లిక్ చేయగానే మిమ్మల్ని ఒక గ్రూపులో చేరుస్తారు. అక్కడ ప్రముఖ స్టాక్ అనలిస్టుల పేరుతో నకిలీ పోస్టులు పెడుతూ ఉంటారు. గ్రూపులోని ఇతర ముఠా సభ్యులు తమకు లక్షల్లో లాభం వచ్చిందని ఫేక్ స్క్రీన్ షాట్లు పెట్టి అందులో వారిని నమ్మిస్తారు.
అలా తాజాగా శేరిలింగంపల్లికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు మొదట రూ. 5 వేల లాభాన్ని చూపించి, ఆ తర్వాత మరింత నమ్మించి ఏకంగా రూ. 2.9 కోట్లు కాజేశారు. బాధితులు తమ ఆస్తులు అమ్మి మరీ ఈ నకిలీ యాప్‌లలో పెట్టుబడులు పెట్టి చివరికి ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు.
ఈ దోపిడీ వెనుక చైనీయుల హస్తం ఉందని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. వీరు థాయ్‌లాండ్, కంబోడియా, మయన్మార్ దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. భారతీయ యువకులను ఉద్యోగాల పేరుతో ఆయా దేశాలకు రప్పించి, వారిని నిర్బంధించి వారితోనే ఇలాంటి మోసాలు చేయిస్తున్నారు.అందుకే ఇలాంటి అనామక వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను నమ్మకూడదని పోలీసులు చెబుతున్నారు
అలా వీరు సృష్టించే వర్చువల్ వెబ్ సైట్లలో లాభాలు కనిపిస్తాయి కానీ, ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం (Withdraw) మాత్రం సాధ్యం కాదు.ఈ విషయం అర్థం చేసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
TVK Vijay :ఒంటరి పోరుకే మొగ్గు..విజయ్ కాన్ఫిడెన్స్ కు కారణాలేంటి ?
