Phone Theft
స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మనిషికి బ్రహ్మాస్త్రం వంటిదన్న విషయం వేరే చెప్పక్కరలేదు. అయితే రద్దీ ప్రదేశాల్లో చిన్నపాటి అజాగ్రత్త వహించినా మీ అకౌంట్లు ఖాళీ అవడం ఖాయం. ఎందుకంటే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ప్రతి నెలా 600 వరకు ఫోన్ల చోరీ కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు 10 నుంచి 15 ఫోన్లు చోరీ (Phone Theft)అవుతున్నాయి. ఒకే ముఠా నుంచి పోలీసులు ఏకంగా 703 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారంటేనే ఈ నెట్‌వర్క్ ఎంత పెద్దదో ఊహించొచ్చు.
ఫోన్ చోరీ (Phone Theft)ముఠాలు ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైతు బజార్లు, బస్సులు ఎక్కే రద్దీ ప్రాంతాలను వీళ్లు ఎంచుకుంటారు. 4 నుంచి 6 మంది ముఠాగా ఏర్పడి ఒకరిని ఒకరు తోసుకుంటున్నట్లు అక్కడ పరిస్థితిని క్రియేట్ చేసి ఎంతో తేలికగా ఫోన్లు కొట్టేస్తారు. ఎస్.ఆర్. నగర్, అమీర్‌పేట్, దిల్ సుఖ్ నగర్, కూకట్ పల్లి వంటి ప్రాంతాలు వీరి ప్రధాన అడ్డాలుగా మారాయి. దొంగిలించిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఆపై అబిడ్స్ జగదీష్ మార్కెట్ వంటి చోట్ల ఉండే రిసీవర్లకు ఈ ఫోన్లు అమ్మేస్తారు.
చోరీ అయిన ఫోన్లలో సుమారు 38 శాతం ఫోన్లు వ్యవస్థీకృత ముఠాల ద్వారా విదేశాలకు వెళ్లిపోతున్నాయి. టెక్నీషియన్ల సాయంతో ఐఎంఈఐ (IMEI) నంబర్లు కూడా వెంటనే మార్చేసి, విమానాల్లో కార్గో ద్వారా లేదా ముంబై, చెన్నై ఓడరేవుల నుంచి షిప్పుల్లో ఆఫ్రికా దేశాలకు, ముఖ్యంగా సౌత్ సూడాన్ వంటి దేశాలకు ఈజీగా పంపించేస్తున్నారు. అక్కడ అంతర్యుద్ధం జరుగుతుండటంతో పాత ఫోన్లకు చాలా ఎక్కువ డిమాండ్ ఉండటమే దీనికి కారణం అని పోలీసులు గుర్తించారు.
ఫోన్ పోయిన వెంటనే 1950 హెల్ప్‌లైన్ కానీ ‘సీఈఐఆర్’ (CEIR) పోర్టల్‌లో కానీ రిజిస్టర్ చేయాలి.అయితే పోలీసులు మీ ఫోన్ కనిపెట్టేలోపే నేరగాళ్లు యూపీఐ (UPI) ద్వారా అకౌంట్లును ఖాళీ చేస్తున్నారు. అందుకే వెంటనే సిమ్ కార్డ్ బ్లాక్ చేసి, బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయించాలి.
అంతేకాదు బిల్లు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి దగ్గరా కూడా పాత సెల్ ఫోన్లు కొనొద్దు. బిల్లు లేని ఫోన్ మీ దగ్గర ఉంటే మిమ్మల్ని కూడా నేరస్థులుగా పరిగణించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అలా ఫోన్ కొన్నవారిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి..
WhatsApp: వాట్సాప్ వేదికగా స్టాక్ మార్కెట్ పేరుతో దోపిడీ..ఎలా బయటపడాలి?
