Japan
జపాన్ దేశ రాజధాని టోక్యోలో సోమవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. రెక్టర్ స్కేల్‌పై ఏకంగా 7.6 తీవ్రత నమోదైన ఈ మహా భూకంపం జపాన్(Japan) ఈశాన్య తీరంలో సునామీ భయాలను కూడా పెంచింది. వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ, మూడు మీటర్ల ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
సాధారణంగానే భూకంపాల పట్ల భయం ఉండే ప్రజల్లో ఈ ఘటన మరింత ఆందోళన కలిగించింది. అయితే, హీరో ప్రభాస్ తన తాజా చిత్రం ‘బాహుబలి ది ఎపిక్’ రిలీజ్ ప్రచారంలో భాగంగా జపాన్‌లోని టోక్యో నగరానికి వెళ్లారు. సరిగ్గా ఈ సమయంలోనే భారీ భూకంపం సంభవించడంతో సోషల్ మీడియాలో డార్లింగ్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. “ప్రభాస్ ఎక్కడున్నారు?”, “ఆయన క్షేమంగా ఉన్నారా?” అంటూ వేలాది మంది అభిమానులు పోస్టులు పెడుతూ ఆయన ఎలా ఉన్నారో అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
అభిమానుల ఆందోళనను గమనించిన దర్శకుడు మారుతి, వెంటనే ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. హీరో ప్రభాస్ జపాన్(Japan)లో క్షేమంగానే ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. తాను స్వయంగా ప్రభాస్‌తో మాట్లాడానని, ప్రభాస్ సేఫ్‌గా ఉన్నారని డైరెక్టర్ మారుతి స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలోనే ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రభాస్ విదేశాలకు వెళ్లడం, సరిగ్గా అప్పుడే ప్రమాదం జరగడం అభిమానుల్లో కొంత టెన్షన్‌ను కలిగించింది.
