Nipah Virus:పెరుగుతున్న నిపా వైరస్ కేసులు..తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

Nipah Virus : నిపా వైరస్ అనేది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఒక ప్రమాదకరమైన వైరస్

Nipah Virus

ప్రస్తుతం దేశంలో నిపా వైరస్ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా సమీపంలో ఉన్న బరాసత్‌లో జనవరి 23వ తేదీ నుంచి సుమారు ఐదు కేసులు ధ్రువీకరించబడ్డాయని నివేదికలు అందుతుండటంతో ప్రజల్లో మళ్లీ టెన్షన్ మొదలయింది. అయితే ఈ వైరస్ గురించి పూర్తి అవగాహన పెంచుకుంటే మనం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చంటున్నారు డాక్టర్లు.

నిపా వైరస్ ( Nipah Virus)అనేది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఒక ప్రమాదకరమైన వైరస్. ఇది మన దేశానికి కొత్తేమీ కాదు. గతంలో కేరళ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో చాలాసార్లు ఈ వైరస్ పంజా విసిరింది. ఇప్పుడు మళ్లీ ఈ కేసు వెలుగులోకి రావడంతో కేంద్ర , రాష్ట్ర ఆరోగ్య సంస్థలు అప్రమత్తమయ్యాయి.

నిపా వైరస్( Nipah Virus) ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్ అని పిలవబడే గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. ఈ గబ్బిలాలు పండ్లను తింటున్నప్పుడు కానీ చెట్లపై ఉన్నప్పుడు కానీ వాటి లాలాజలం, మూత్రం ద్వారా వైరస్ బయటకు వస్తుంది. ముఖ్యంగా ఈత కల్లు, తాటి రసం, చెట్ల నుంచి పడిపోయిన పండ్ల ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకుతుంది.

ఒకసారి ఒక మనిషికి ఈ వైరస్ సోకిన తర్వాత, వారి ద్వారా ఇతరులకు కూడా ఇది వ్యాపిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు బయటపడిన కేసులు కూడా ఆసుపత్రి సిబ్బందికి సోకడం ఆశ్చర్యం కలిగించే విషయంగా మారింది. అంటే ఇన్‌ఫెక్షన్ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి ప్రయాణిస్తుందని తేలింది.

నిపా వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయటపడటానికి 4 – 14 రోజుల సమయం పడుతుంది. దీనిని ఇన్‌క్యుబేషన్ పీరియడ్ అంటారు. మొదటగా ఇది సాధారణ ఫ్లూ లాగే కనిపిస్తుంది. విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి , వాంతులు వంటివి కనిపిస్తాయి. అయితే ఈ వైరస్ అత్యంత ప్రమాదకరంగా మారేది రెండో దశలోనే అట. ఇది నేరుగా మెదడుపైన ఎఫెక్ట్ చూపిస్తుంది.

దీనివల్ల రోగికి మతిస్థిమితం తప్పడం, మాట పడిపోవడం, వింతగా ప్రవర్తించడం, అరుపులు పెట్టడం వంటివి జరుగుతాయి. దీనిని ఎన్సెఫలైటిస్ లేదా మెదడు వాపు వ్యాధి అని పిలుస్తారు. అలాగే ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం కూడా దీని ప్రధాన లక్షణం. పరిస్థితి విషమిస్తే 24 నుంచి 48 గంటల్లో రోగి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముంటుంది.

మిగిలిన వైరస్‌లతో పోలిస్తే నిపా వైరస్ వల్ల మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుందని తేలింది. సుమారు 40 నుంచి 75 శాతం మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇప్పటివరకు దీనికి ఎటువంటి వ్యాక్సిన్ , మెడిసిన్స్ అందుబాటులో లేవు.

కేవలం లక్షణాలకు అనుగుణంగా ఇచ్చే చికిత్స అంటే వెంటిలేటర్ సపోర్ట్, బాడీలో లిక్విడ్ లెవల్స్‌ను కాపాడటం వంటి సపోర్టివ్ కేర్ మాత్రమే ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం. అందుకే లక్షణాలు కనిపించిన మొదటి మూడు రోజుల్లోనే డాక్టర్లను సంప్రదించడం చాలా ఇంపార్టెంట్.

నిపా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ముందస్తు జాగ్రత్తలే శ్రీరామరక్ష అంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ , కేరళ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వారు కనీసం 21 రోజుల పాటు కచ్చితంగా ఐసోలేషన్‌లో ఉండాలి.

దీనికి చెక్ పెట్డడానికి ముఖ్యంగా గబ్బిలాలు సంచరించే చెట్ల కింద పడి ఉన్న పండ్లను పొరపాటున కూడా తినకూడదు. మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి బాగా కడిగి, పీల్ తీసి మాత్రమే తినాలి.

Nipah Virus

ముఖ్యంగా ఈత కల్లు , తాటి రసం వంటివి నేరుగా చెట్టు నుంచి తీసినవి తాగడం మానుకోవాలి. ఎందుకంటే గబ్బిలాలు వాటిని తాగే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. చేతులను తరచూ సోపుతో కడుక్కోవాలి. ఆసుపత్రులకు వెళ్లినప్పుడు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో N95 మాస్క్ ధరించడం వల్ల వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చు.

వైరస్ వార్తలు వినగానే పానిక్ అవ్వడం లేదా భయపడటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకూడదు. చైనా నుంచి వచ్చే HMPV వైరస్ , నిపా వైరస్ రెండూ వేరు. జ్వరం వస్తే సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

నిపా రిస్క్ ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారు..వెంటనే ఇతరులతో కలవకూడదు. 21 రోజుల క్వారంటైన్ నిబంధనను కఠినంగా పాటించాలి. మరణించిన వ్యక్తుల దేహాలను తాకడం, ముద్దు పెట్టడం, దగ్గరకు వెళ్లడం చేయకూడదు, ఎందుకంటే మరణించిన తర్వాత కూడా ఈ వైరస్ వ్యాపించే అవకాశముంటుంది.

ప్రస్తుతానికి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిపా వైరస్ కేసులు నమోదు కాలేదు. కానీ మనం అప్రమత్తంగా ఉండటం అవసరం. ఈత , ఖర్జూరం సీజన్ కావడంతో ఈ పండ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రభుత్వం ఇచ్చే అధికారిక గైడ్‌లైన్స్‌ను మాత్రమే అనుసరించాలి. లక్షణాలు కనిపించిన వెంటనే 104 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలి.

Electric Cycle:రూ. 5000 చెల్లిస్తే ఎలక్ట్రిక్ సైకిల్ సొంతం.. సచివాలయాల్లో దరఖాస్తులు

Exit mobile version