Akhanda-2 records
తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం ‘అఖండ 2’ (Akhanda-2 records)సిద్ధమైంది. బాలయ్య అభిమానుల కలల ప్రాజెక్టుగా భావిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలకు తగ్గట్టే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా బాలయ్య సినిమాకు పెద్దపీట వేశాయి. టికెట్ ధరల పెంపుతో పాటు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలు కూడా ఈ సినిమా విజయాన్ని కాంక్షిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భారీ చిత్రానికి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. సినిమా విడుదల రోజున ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, అలాగే నిర్మాతలకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు వీలుగా టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు, డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రత్యేక షో కోసం టికెట్ ధరను రూ.600 గా నిర్ణయించారు.
ఇక డిసెంబర్ 5న సినిమా విడుదలైన తర్వాత, మొదటి పది రోజుల పాటు పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి. సింగిల్ స్క్రీన్లలో ప్రతి టికెట్ ధరపై అదనంగా రూ.75 పెంచుకోవచ్చు. అదే మల్టీప్లెక్స్‌లలో అయితే ఈ పెంపు రూ.100 వరకు ఉంటుంది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లోని బాలయ్య అభిమానులకు పది రోజుల పాటు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొనడం ఖాయం.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం కూడా ‘అఖండ 2’ (Akhanda-2 records)సినిమాకు సానుకూల నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కూడా సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచే సినిమా ప్రీమియర్లు మొదలు కానున్నాయి. ప్రీమియర్స్ టికెట్ ధరను ఇక్కడ కూడా రూ.600 గానే నిర్ణయించారు.
అయితే, టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా భిన్నంగా వ్యవహరించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.50 పెంపు, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంపునకు అనుమతి ఇచ్చింది. కాకపోతే, ఈ పెరిగిన ధరల అనుమతి కేవలం మొదటి మూడు రోజులు మాత్రమే అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా కూడా ఇది సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడానికి దోహదపడే మంచి నిర్ణయంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయెల్ రోల్‌లో నటించి ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి సిద్ధమవుతున్నారు. వీరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ముఖ్యంగా ‘అఖండ’ సినిమా బాలయ్య కెరీర్‌లోనే ఒక మైలురాయి. ఆ సినిమాతో తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన బాలయ్య, ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ సినిమాలతో వరుసగా నాలుగు సార్లు వంద కోట్ల మార్కును అందుకున్న తొలి సీనియర్ హీరోగా చరిత్ర సృష్టించారు.
ఇప్పుడు, ‘అఖండ 2′(Akhanda-2 records) తో రాబోతున్న బాలయ్య, ఈ రికార్డుల పరంపరను కొనసాగించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారం, భారీ అంచనాలు ,పెరిగిన టికెట్ ధరలతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం అని నందమూరి అభిమానులు జోస్యం చెబుతున్నారు. .
