OTT: ఓటీటీలకు ఇకపై సెన్సార్ ఉండదు.. కానీ రూల్స్ ఇలా ఉండబోతున్నాయి

OTT: ఓటీటీలు ఏవీ కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అంటే సెన్సార్ బోర్డు పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది.

OTT

సాధారణంగా మనం థియేటర్లో చూసే సినిమాలకు సెన్సార్ బోర్డు ఉంటుంది. సినిమాలో ఏవైనా అడల్ట్ సీన్లు ఉన్నా, బూతులు ఉన్నా లేదా రక్తం చిందే హింస ఎక్కువగా ఉన్నా సెన్సార్ బోర్డు వాటిని కట్ చేస్తుంది. ఆ సినిమా చిన్నపిల్లలు చూడొచ్చా లేదా కేవలం పెద్దలు మాత్రమే చూడాలా అనేది సెన్సార్ సర్టిఫికేట్ ద్వారా నిర్ణయిస్తారు.

అయితే కొన్నేళ్లుగా ఓటీటీ (OTT)ప్లాట్‌ఫామ్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి యాప్స్ లో వచ్చే వెబ్ సిరీస్ లలో అసభ్యకరమైన మాటలు, నగ్నత్వం , హింస చాలా ఎక్కువగా ఉంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. వీటికి సెన్సార్ బోర్డు లేకపోవడంతో దర్శక నిర్మాతలు తమ ఇష్టమొచ్చినట్లు కంటెంట్ తీస్తున్నారని, దీనివల్ల సొసైటీపై చెడు ప్రభావం పడుతోందని చాలా కాలంగా ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఓటీటీలకు కూడా సెన్సార్ బోర్డు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

OTT

దీంతో తాజాగా పార్లమెంట్ లో ఓటీటీ (OTT)సెన్సార్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఓటీటీలు ఏవీ కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అంటే సెన్సార్ బోర్డు పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం వీటికి సెన్సార్ నిబంధనలు వర్తించవని లోక్ సభలో తేల్చి చెప్పారు. అయితే దీని అర్థం ఓటీటీలు ఏవైనా చూపించవచ్చని కాదు.

సెన్సార్ లేకపోయినా ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను పెట్టింది. చట్టపరంగా నిషేధించిన కంటెంట్ ను కానీ, నగ్నత్వాన్ని కానీ ఓటీటీలు నేరుగా చూపించకూడదు. అలాగే ప్రతి సినిమా లేదా సిరీస్ కి ఇది ఏ వయసు వారు చూడాలనే రేటింగ్ కచ్చితంగా ఇవ్వాలి. కంటెంట్ తయారు చేసే సంస్థలే ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకుని స్వీయ నియంత్రణ పాటించాలి.

ఒకవేళ ఏదైనా అభ్యంతరకర కంటెంట్ ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వస్తే, దానిని కేవలం 24 గంటల్లోనే తొలగించాల్సి ఉంటుంది. అంటే సెన్సార్ బోర్డు లేకపోయినా, ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచుతుందన్నమాట.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version