Botox
సినీ తారలు, సెలబ్రిటీలు వయసు మీద పడుతున్నా చిన్నవారిలో ఎలా కనిపిస్తారనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. అయితే గతంలో ఇది ఒక రహస్యంగా ఉన్నా, ఇప్పుడు దాని వెనుక ఉన్న చికిత్సల గురించి అందరికీ తెలుస్తోంది. వాటిలో బాగా ఫేమస్ అయిన ట్రీట్మెంట్ మాత్రం ..బొటాక్స్. అయితే ఈ ట్రీట్‌మెంట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటే కొత్త సమస్యలు రావచ్చు. బొటాక్స్ అంటే ఏమిటి, దాని వల్ల కలిగే లాభాలు, నష్టాలు, ఖర్చు వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
బొటాక్స్ (Botox)అనేది క్లోస్ట్రిడియం బొటులినమ్ అనే బ్యాక్టీరియా నుంచి తయారయ్యే ఒక శుద్ధి చేసిన ప్రోటీన్. దీన్ని ఒక ఇంజెక్షన్ ద్వారా చర్మంలోని నిర్దిష్ట కండరాల్లోకి పంపిస్తారు. ఇది కండరాలకు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్‌ను బ్లాక్ చేస్తుంది. దానివల్ల కండరాలు తాత్కాలికంగా రిలాక్స్ అవుతాయి. ముఖంపై ముడతలు, గీతలు తగ్గుతాయి. మొత్తం చికిత్సకు కేవలం 10 నుంచి 20 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇది నాన్-సర్జికల్ ట్రీట్‌మెంట్ కాబట్టి, ఆపరేషన్, అనస్థీషియా అవసరం లేదు.
బొటాక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..బొటాక్స్ కేవలం అందాన్ని పెంచడానికే కాదు, కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా పరిష్కారంగా పనిచేస్తుంది.
అలాగే ముఖంపై, నుదుటిపై, కళ్ల కింద ఉండే గీతలు, ముడతలు తగ్గిపోయి(Botox for wrinkles) చర్మం మృదువుగా, యవ్వనంగా కనిపిస్తుంది.దీర్ఘకాలిక మైగ్రేన్ తలనొప్పులను తగ్గించడానికి కూడా బొటాక్స్‌ను ఉపయోగిస్తారు.అధికంగా చెమట పట్టే సమస్య ఉన్నవారికి బొటాక్స్ చాలా ఉపయోగపడుతుంది. ఇది చెమట గ్రంథుల పనితీరును నియంత్రిస్తుంది. ముఖంపై ముడతలు, వయసు ఛాయలు లేకపోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
బొటాక్స్ ట్రీట్‌మెంట్‌కు ఖర్చు చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖంలో ఏ భాగానికి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు, ఎన్ని ఇంజెక్షన్లు అవసరం, డాక్టర్ అనుభవం, క్లినిక్ ఉన్న ప్రాంతం వంటి వాటివల్ల ట్రీట్మెంట్ కాస్ట్ ఉంటుంది. సాధారణంగా లీస్టులో చూసుకుంటే.. ఒక ఇంజెక్షన్‌కు (యూనిట్‌కు) ₹500 నుంచి ₹1500 వరకు ఖర్చు అవుతుంది. ముఖంలోని నుదురు, కళ్ల చుట్టూ ఉన్న ముడతలకు 10 నుంచి 50 యూనిట్ల వరకు అవసరం పడుతుంది. అందుకే మొత్తం ట్రీట్‌మెంట్ ఖర్చు రూ.5,000 నుంచి రూ.50,000 వరకు ఉండొచ్చు.
బొటాక్స్ (Botox) వల్ల కొన్ని టెంపరరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. ఇంజెక్షన్ ఇచ్చిన చోట చిన్నగా వాపు, ఎరుపు, నొప్పి లేదా కొద్దిపాటి తలనొప్పి రావచ్చు.కొందరికి కనురెప్పలు వంగిపోవడం, కళ్లు పొడిబారడం, ముఖ కండరాల బలహీనత వంటివి జరగొచ్చు. సరైన నైపుణ్యం లేని డాక్టర్ వద్ద చికిత్స చేయించుకుంటే, ముఖం రూపురేఖలు మారి, సహజంగా లేనట్లుగా కనిపించొచ్చు. బొటాక్స్ అనేది ఒకప్పుడు సెలబ్రిటీల రహస్యంగా ఉన్నా , ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. అయితే, ఈ చికిత్స చేయించుకునే ముందు దాని లాభాలు, నష్టాల గురించి పూర్తిగా తెలుసుకొని, ఒక ఎక్స్‌పర్ట్ సలహా తీసుకోవడం చాలా అవసరం.
Also Read: Blood donation: బ్లడ్ డొనేషన్ ప్రాణం పోస్తుంది..కొన్ని సార్లు ప్రాణం తీస్తుంది కూడా..