Megastar
టాలీవుడ్‌లో పని ఆగిపోయింది. సెట్లు సైలెంట్ అయ్యాయి. కెమెరాలు ఆగిపోయాయి. ఇప్పటికే మూడో రోజుకు చేరిన సినీ కార్మికుల సమ్మె… ఇంకా ఎలాంటి పరిష్కారమూ లేకుండా ముందుకు సాగుతోంది. వేతనాలు పెంచినప్పుడే మేము తిరిగి పని చేస్తామంటూ అంతే పట్టుదలతో కార్మికులు నిలబడ్డారు. వందల సంఖ్యలో షూటింగ్ యూనిట్లు నిలిచిపోయాయి. చిన్న సినిమాల నిర్మాతలు ఊహించని పరిస్థితులతో తల్లడిల్లిపోతున్నారు. పెద్ద సినిమాలకూ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది.
ఇప్పటికే కార్మికుల ఫెడరేషన్ వైపు నుంచి స్పష్టమైన డిమాండ్‌లు వచ్చాయి. అన్ని విభాగాలకూ ఒకే సారిగా వేతనాల పెంపు కావాలని స్పష్టం చేశారు. కానీ నిర్మాతలు మాత్రం ఇది ఆర్థికంగా సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్న సినిమాల నిర్మాతలు, సాంకేతిక విభాగాలకి ఇదంతా భారం అవుతుందని వాదిస్తున్నారు. ఇదే కార్మికుల్లో(cine workers) ఆగ్రహం తెప్పించింది.
ఈ పరిస్థితుల్లో, ఈరోజు నిర్మాతల గిల్డ్ కీలకంగా భేటీ కానుంది. కార్మికుల డిమాండ్లపై ఆలోచించి, ఒక నిర్ణయానికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, సమస్య ఇంతటితో ఆగడం లేదు. ఫిల్మ్ ఫెడరేషన్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన కొంతమంది నిర్మాతలు మీడియా ముందు బహిరంగంగా మాట్లాడేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడే అయితే కాదు .. కానీ వేడి ఇంకా పెరిగితే, ప్రెస్‌మీట్ ఖాయమనే వాతావరణం ఉంది.
ఇటు, పరిస్థితిని చల్లబెట్టేందుకు రంగంలోకి దిగిన పెద్ద మనుషులలో మొదటిపేరు చిరంజీవిది. ఇప్పటికే నిర్మాతల గిల్డ్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ని కలిసి సమస్య వివరించారు. ఈరోజు సాయంత్రం కార్మిక ఫెడరేషన్ నేతలు కూడా మెగాస్టార్‌ను కలవనున్నారు. రెండు వర్గాల సమస్యలను వినిన చిరంజీవి, ఈ సంక్షోభానికి ఒక సమగ్ర పరిష్కారం చూపుతారని చిత్రపరిశ్రమ మొత్తం ఆశగా చూస్తోంది.
ఇప్పటికే చిరంజీవి గతంలోనూ ఇటువంటి సమస్యల్లో మధ్యవర్తిత్వం చేసి అనేకసార్లు పరిష్కారానికి దారితీశారు. ఇప్పుడు కూడా మెగాస్టార్ అలాంటి మెగా సాయం చేస్తే.. సమస్య సాల్వ్ అవుతుందన్న నమ్మకం ఇండస్ట్రీలో ఉంది.
ప్రస్తుతం అందరి కళ్లూ చిరంజీవి,ఫెడరేషన్ భేటీపైనే పడ్డాయి. అక్కడి నుంచి వచ్చే సంకేతాలే ఈ సమ్మె భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. వేతనాల కోసం వాడిన ఈ పోరాటం..మెగాస్టార్ జోక్యంతో కూల్ అవుతుందా? లేక వివాదం మరింత ముదిరిపోతుందా అనేది ఈరోజు సాయంత్రమే తేలనుంది.