Bangladesh
బంగ్లాదేశ్(Bangladesh)లో మైనారిటీ హిందువుల పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. అక్కడి అరాచక శక్తులు హిందువులనే లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడులు, హత్యలతో మిగిలిన హిందువులు భయంతో వణికిపోతున్నారు.
మైమెన్‌సింగ్‌లో ఇటీవల దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని కిరాతకంగా చంపిన ఘటనను ఇంకా ఎవరూ మర్చిపోక ముందే, తాజాగా బజేంద్ర బిశ్వాస్ అనే హిందూ వ్యక్తిని పట్టపగలు వందలాది మంది చూస్తుండగానే కాల్చి చంపడం సంచలనం సృష్టిస్తోంది.
ఈ దారుణం ఒక బట్టల ఫ్యాక్టరీలో జరగడం, అక్కడి కార్మికులు చూస్తుండగానే నిందితుడు తన క్రూరత్వాన్ని ప్రదర్శించడం భయాందోళనలు నింపుతోంది. అదీ కూడా 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్.. తన తోటి ఉద్యోగి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం వెనుక మతపరమైన విద్వేషం కూడా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
మైమెన్‌సింగ్‌లోని ఒక ప్రముఖ బట్టల కంపెనీలో బజేంద్ర బిశ్వాస్ , నోమన్ మియాన్ అనే యువకుడు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. కేవలం 22 ఏళ్ల వయస్సు ఉన్న నోమన్ మియాన్, పక్కా ప్రణాళికతో తన వద్ద ఉన్న తుపాకీతో బజేంద్రపై కాల్పులు జరిపాడు.
ఫ్యాక్టరీ ప్రాంగణంలో అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. కాల్పుల ధాటికి బజేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే బజేంద్ర బిశ్వాస్ కేవలం అక్కడ ఫ్యాక్టరీ కార్మికుడు మాత్రమే కాదని, ఆయన తన గ్రామానికి రక్షణగా ఏర్పడిన ఒక పారామిలిటరీ గ్రూపులో కూడా క్రియాశీల సభ్యుడిగా పనిచేస్తున్నారని సమాచారం.
బంగ్లాదేశ్(Bangladesh)లో హిందూ గ్రామాలపై వరుసగా దాడులు జరుగుతుండటంతో.. తమ వారిని కాపాడుకోవడానికి బజేంద్ర ముందుండటమే ఇప్పుడు అతడి ప్రాణాల మీదకు తెచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ రక్షకుడిగా ఉన్న వ్యక్తిని ఇలా కాల్చి చంపడం ద్వారా హిందువులను మరింత భయపెట్టడమే అల్లరిమూకల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
బంగ్లాదేశ్‌లో ఇదే మైమెన్‌సింగ్‌లో దీపు చంద్ర దాస్ అనే వ్యక్తిని ఒక గుంపు ఫ్యాక్టరీ నుంచి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి క్రూరంగా కొట్టి చంపారు. అంతటితో ఆగకుండా అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టి నిప్పంటించడం చూస్తే అక్కడి మత ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్ధం అయింది.
ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనుస్ శాంతిభద్రతలను కాపాడతామని హామీలు ఇచ్చినా సరే క్షేత్రస్థాయిలో మైనారిటీల ప్రాణాలకు ఎటువంటి రక్షణ కరువైంది. కేవలం ఈ డిసెంబర్ నెలలోనే ఎనిమిది మందికి పైగా హిందువులను అల్లరిమూకలు పొట్టనబెట్టుకున్నాయి. ఈ హత్యలు యూనుస్ ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బంగ్లాదేశ్(Bangladesh)లో జరుగుతున్న ఈ వరుస హత్యలపై భారత్ ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీల హక్కులను , వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఆ దేశ ప్రభుత్వంపై ఉందని భారత్ పదేపదే హెచ్చరిస్తున్నా …ఫ్యాక్టరీలలో, బహిరంగంగా హిందువుల రక్తం చిందించడం ఆ దేశాన్ని అస్థిరత వైపు నెట్టేస్తోంది.
ఈ దాడుల వెనుక ఉన్న నిందితులను కఠినంగా శిక్షించకపోవడం వల్లే అల్లరిమూకలకు మరింత ధైర్యం వస్తోందని మానవ హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. ఈ క్రూరత్వానికి అడ్డుకట్ట పడకపోతే బంగ్లాదేశ్ లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళ వ్యక్తం చేస్తున్నాయి.
