Bangkok: బ్యాంకాక్ గురించి మీకీ సంగతులన్నీ తెలుసా?
Bangkok: బ్యాంకాక్ పేరు కేవలం ఒక లేబుల్ కాదు, అది ఆ నగరంలోని చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలకు ఒక అద్భుతమైన చిహ్నం.

Bangkok
కొంతమంది ఏ మాత్రం తీరిక దొరికినా విమానం టికెట్ బుక్ చేసి వెళ్లిపోయే ఒక సూపర్ డెస్టినేషన్ ఉందంటే అది బ్యాంకాక్. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది కళ్లు చెదిరే లైటింగ్,అందమైన అమ్మాయిలు, రాత్రిపూట కూడా జనాన్ని ఆకర్షించే వీధులు, థాయ్ మసాజ్‌లు, అద్భుతమైన బీచ్‌లు, అదిరిపోయే పార్టీలు. థాయిలాండ్ రాజధాని అయిన బ్యాంకాక్‌లో..పర్యాటకులతో నిత్యం ఒక పండగ వాతావరణమే ఉంటుంది. అందుకే బ్యాంకాక్ కేవలం ఒక సిటీ కాదు, అది ఎప్పుడూ నిద్రపోని ఒక ఫీస్ట్!
అయితే ప్రపంచంలో కొన్ని నగరాలు వాటి అందంతో ఆకట్టుకుంటే, మరికొన్ని వాటి చరిత్రతో ఆశ్చర్యపరుస్తాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ మాత్రం ఈ రెండింటితో పాటు, తన పేరుతోనే ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తుంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద దేవాలయాలు, మరోవైపు గ్లాస్ స్కైలైన్, చావో ఫ్రాయా నదిలో ప్రవహించే జీవితం.. ఇవన్నీ బ్యాంకాక్‌ను ఒక ప్రత్యేకమైన గమ్యస్థానంగా మార్చాయి.
సాధారణంగా మనం పిలిచే బ్యాంకాక్ (Bangkok) అనేది ఆ నగర పూర్తి పేరులో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ నగరానికి ఉన్న పూర్తి పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో “ప్రపంచంలోనే అత్యంత పొడవైన నగర పేరు”గా నమోదైంది. ఈ పేరు ఒక పదం కాదు, ఒక కవిత, ఒక కీర్తన! అది.. “క్రుంగ్ థెప్ మహా నాఖోన్ అమోన్ రతన కోసిన్ మహింత్రయుత్తయ మహ దిలోక్ పోప్ నప్ప రాట్ రటచా థాని బురి రోమ్ ఉడొమ్ రటాచ నివెట్ మహా సతాన్ అమోన్ ఫిమన్ అవటాన్ సట్‌హిట్ సఖ తాట్టియా విట్సనుకమ్ ప్రసిట్.
ఈ పొడవైన పేరులో ప్రతి పదానికీ ఒక లోతైన అర్థం ఉంది. “క్రుంగ్ థెప్” అంటే “దేవతల నగరం”, “మహా నిఖోన్” అంటే “అమరత్వం పొందిన నగరం”, “రటచా థాని బురి రోమ్” అంటే “మానవుడి రూపంలో ఉన్న దేవతల ఇల్లు” అని అర్థం. మొత్తంగా ఈ పేరు బ్యాంకాక్‌ను అత్యంత అలంకారమైన, విష్ణుదేవుడు నివసించే, ఇంద్రుడు తన ఆశీస్సులతో నిర్మించిన గొప్ప నగరంగా వర్ణిస్తుంది. స్థానికులు మాత్రం దీన్ని “క్రుంగ్ థెప్” అనే సంక్షిప్త పేరుతోనే పిలుస్తారు.

ఈ అద్భుతమైన (Bangkok) నగరం ఒక చిన్న పల్లె నుంచి మహానగరంగా ఎదిగింది. 15వ శతాబ్దంలో చావో ఫ్రాయా నది ఒడ్డున ఒక చిన్న వర్తక కేంద్రంగా ఉండేది. 1782లో థాయ్ రాజ్యానికి రాజు అయిన రామ-1 బ్యాంకాక్‌ను రాజధానిగా ప్రకటించి దీనికి మొదటి రాజరికంగా పేరు పెట్టారు. ఆ తర్వాత 1850లో కింగ్ మాంగ్‌కుట్ (రామ IV) ఈ సుదీర్ఘమైన పేరును అధికారికంగా అందించారు. అప్పటి నుంచి బ్యాంకాక్ వాణిజ్య, పర్యాటక రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచ నగరాల సరసన నిలిచింది.
బ్యాంకాక్(Bangkok) కేవలం ఆర్థిక కేంద్రం మాత్రమే కాదు, అది థాయి సంస్కృతికి ఒక గుండెకాయ. ఇక్కడ ఉన్న అద్భుతమైన ఆలయాలైన వాట్ ఫో , వాట్ అరుణ్ దాని గొప్ప చరిత్రకు, ఆధ్యాత్మికతకు నిదర్శనం. నగరంలోని వీధుల్లోని ఆహారం నుంచి ఆధునిక స్కైలైన్‌ల వరకు అన్నీ ఈ నగరాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. బ్యాంకాక్ పేరు కేవలం ఒక లేబుల్ కాదు, అది ఆ నగరంలోని చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలకు ఒక అద్భుతమైన చిహ్నం.అందుకే బ్యాంకాక్ పూర్తి పేరును అర్థం చేసుకోవడం అంటే ఆ నగరం ఆత్మను అర్థం చేసుకోవడమే అంటారు అక్కడివారు.