Sex
చాలా దేశాల్లో పెళ్లికి ముందు సహజీవనం, శృంగారం(sex) చేయడం గత కొంతకాలంగా సాధారణమైపోయింది. దానిని ఒక ఫ్యాషన్ గా , లేటెస్ట్ ట్రెండ్ గా భావిస్తూ యువత ఫాలో అయిపోతున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటూ ఇలా పెడదోవ పడుతున్నారు. కొన్ని దేశాల్లో వీటిపై ఎటువంటి ఆంక్షలు లేవు.. మరికొన్ని దేశాల్లో మాత్రం కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి. తాజాగా ఇండోనేషియా ప్రభుత్వం కఠిన చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై పెళ్లికి ముందు సహజీవనం, శృంగారం(sex) చేస్తే నేరుగా జైలుకే పంపిస్తారు.
గతంలో అనుసరించిన వలసవాద చట్టాలను పక్కకుపెట్టి కొత్తగా తాము సొంతంగా రూపొందించుకున్న శిక్షాస్మృతిని అమలు చేయాలని ఇండోనేషియా నిర్ణయించింది.దీని ప్రకారం ఇకపై అక్కడ పెళ్లికి ముందు సెక్స్ (Sex) , సహజీవనం లాంటివి చేస్తే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఆ దేశపు కొత్త శిక్షాస్మృతిలో భాగంగా ఆర్టికల్ 411 ప్రకారం వివాహం కాకుండా సెక్స్ లో (sex) పాల్గొంటే ఏడాది పాటు జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తారు.
అయితే ఈ కొత్త చట్టం అమలులో కీలక నిబంధనలు ఉన్నాయి. ఈ రూల్స్ ప్రకారం సదరు అమ్మాయి లేదా అబ్బాయి తల్లిదండ్రులు లేదా పిల్లలు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదు చేస్తారు. వీరు కాకుండా అపరిచిత వ్యక్తులు కంప్లైంట్ చేస్తే పరిగణలోకి తీసుకోరు. అలాగే పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో కలిసి ఉన్నవారిపైనా కఠినంగా వ్యవహరించబోతున్నారు. అలాంటి జంటలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తారు. వారికి గరిష్టంగా ఆరు నెలల వరకూ జైలుశిక్ష విధించే అవకాశముంటుంది.
ఇది కేవలం ఇండోనేషియా పౌరులకు మాత్రమే కాదు అక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులకు సైతం వర్తిస్తుంది. బాలి వంటి టూరిస్ట్ స్పాట్ లకు వచ్చే విదేశీయులు పైనా ఇవే ఆంక్షలు ఉండబోతున్నాయి.
అయితే టూరిస్టులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. అక్కడి హోటల్స్ , ఇతర వ్యాపారులు సైతం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులపై ఇలాంటి ఆంక్షలు విధిస్తే టూరిజంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. అదే సమయంలో విదేశీ పెట్టుబడులపైపా ఎఫెక్ట్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
దీనికి సంబంధించిన బిల్లును ఇండోనేషియా పార్లమెంటులో 2022లోనే ఆమోదించినా.. మూడేళ్ల తర్వాత అమల్లోకి వచ్చింది. 2019లో అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం చట్టంలో కొన్ని మార్పులు చేసి ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చింది.
