Trump: భారత్ పై అమెరికా కుట్ర? మోదీ సర్కారుకు ట్రంప్ తలనొప్పి

Trump: రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతి చేసుకోవడంపై తాను మోడీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాననీ.. భారత్‌ రష్యా చమురు కొనడం వల్ల పుతిన్‌ యుద్ధం కొనసాగించేందుకు నిధులు ఉపయోగిపడుతున్నాయని అమెరికా భావిస్తోందన్నారు.

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) రోజురోజుకూ దిగజారిపోతున్నారు. తన స్వార్ధం కోసం దారుణమైన అబద్ధాలు చెప్పడంలోనూ వెనుకాడడం లేదు. భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం శాంతి నెలకొల్పింది తానే అని ప్రకటించుకున్న ట్రంప్ తర్వాత పలు విషయాల్లో ఇదే తరహా అబద్ధాలు చెబుతూ నవ్వుల పాలయ్యారు. తాజాగా రష్యా చమురు కొనుగోలు ఆపేయనున్నట్లు మోడీ తనకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగుగా అభివర్ణించారు.

రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతి చేసుకోవడంపై తాను మోడీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాననీ.. భారత్‌ రష్యా చమురు కొనడం వల్ల పుతిన్‌ యుద్ధం కొనసాగించేందుకు నిధులు ఉపయోగిపడుతున్నాయని అమెరికా భావిస్తోందన్నారు. చైనా కూడా రష్యా ఆయిల్‌ కొనకుండా చేస్తానని, ఇక అదొక్కటే బ్యాలెన్స్ అని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. అసలు మోడీ, ట్రంప్(Trump) మధ్య ఎటువంటి చర్చ జరగలేదనీ, రష్యా చమురు కొనుగోళ్లు ఆపేయడం కాదు తగ్గించే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పింది. భారత్, రష్యా స్నేహబంధం గురించి తెలిసిన ఎవరూ ట్రంప్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ మాత్రం ట్రంప్ మాటలను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మోడీ టార్గెట్‌గా సంచలన ట్వీట్ చేశారు.

Trump

డొనాల్డ్ ట్రంప్‌(Trump)కి మోడీ భయపడిపోయారని ఆరోపించారు. దీనికి తాజాగా జరిగిన 5 ఘటనలే తార్కాణమని రాహుల్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో ట్రంప్‌ జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపానని చెబుతున్నప్పటికీ మోడీ నోరెత్తకపోవడం, ఆ వ్యాఖ్యలను విభేదించకపోవడం వంటి చర్యల్ని చూస్తే.. మోడీ ట్రంప్‌కి భయపడిపోయారని తెలుస్తోందంటూ రాహుల్‌ విమర్శించారు. రెండ్రోజుల క్రితం రష్యా నుంచి చమురు కొనుగోళ్లే ఆపేస్తామని స్వయంగా మోడీనే హామీ ఇచ్చారన్న ట్రంప్.. ఇప్పుడు మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఎంతో కొంత తగ్గించిందన్నారు.

మునుపటి కంటే తక్కువగానే రష్యా ఆయిల్‌ను భారత సర్కారు కొంటోందని, త్వరలోనే పూర్తిగా ఆ కొనుగోళ్లను ఆపుతుందన్నారు. ట్రంప్ రెండోసారి ఈ వ్యాఖ్యలు చేయడంతో మోడీ సర్కార్‌పై విపక్ష కాంగ్రెస్ మళ్లీ మండిపడింది. మొత్తం మీద ట్రంప్ వ్యాఖ్యలు మోదీ సర్కారుకు తలనొప్పిగా మారాయి. మోడీ సర్కార్‌ను రాజకీయంగా ఇరుకునపెట్టడమే ట్రంప్ లక్ష్యంగా చెబుతున్నారు. తన మాట వినని నేతలు, ప్రభుత్వాలను కూల్చడం అమెరికాకు అలవాటే. ఇప్పటికే భారత్‌పై డీప్ స్టేట్ కుట్రలు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version