Obesity
ప్రస్తుతం ప్రపంచం.. యుద్ధాల కంటే కూడా ప్రమాదకరమైన రెండు వ్యాధుల పిడికిలిలో చిక్కుకుంది. అవే ఒబెసిటీ (Obesity), మధుమేహం (Diabetes). ఈ రెండు వ్యాధులు కేవలం ఆరోగ్యానికే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే గొడ్డలి పెట్టుగా మారుతున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. గణాంకాల ప్రకారం, ఈ జబ్బుల వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల 40 లక్షల మంది తమ ప్రొడక్టివిటీని కోల్పోతున్నారు.
అంటే వీరంతా అనారోగ్యం వల్ల పనికి దూరమవ్వడం వల్ల ఒక చిన్న దేశ జనాభా ఆర్థిక వ్యవస్థ నుంచి మాయమైపోయినట్లేనని అర్థం. ఇదే వేగంతో పరిస్థితి కొనసాగితే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది ఓవర్ వెయిట్‌తో బాధపడే ప్రమాదం ఉందని అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. దీనివల్ల ఏటా 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ విషయంలో భారతదేశం పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. డయాబెటిస్ (Obesity)వల్ల తీవ్రంగా నష్టపోతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ వ్యాధుల వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారం సుమారు 1.6 ట్రిలియన్ డాలర్లు. మన దేశంలో చాలా మంది యువత చిన్న వయసులోనే డయాబెటిస్ బారిన పడటం వల్ల పని సామర్థ్యం తగ్గుతోంది. 2035 నాటికి భారత్‌లో సగం మంది ఒబెసిటీ బారిన పడనున్నట్లు తెలుస్తోంది.
దీంతో తరచుగా ఆఫీసులకు సెలవులు పెట్టడం, ఆరోగ్య సమస్యల వల్ల త్వరగా రిటైర్ అయిపోవడం వల్ల కంపెనీలకు , దేశాదాయానికి భారీగా గండి పడుతోంది. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడం కంటే, వ్యాధి రాకుండా నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ నష్టాన్ని భారీగా తగ్గించొచ్చు. అమెరికా వంటి దేశాలు ఇప్పటికే కొత్త రకమైన మందులతో ఒబెసిటీని 2 శాతం తగ్గించి ఆర్థికంగా లాభపడ్డాయి.
ప్రజల ఆరోగ్యంపై ఇప్పుడు ప్రభుత్వం లేదా కంపెనీలు పెట్టే ప్రతి రూపాయి ఖర్చు, భవిష్యత్తులో వంద రెట్లు ఆర్థిక లాభాలను తిరిగి ఇస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రపంచం మొత్తం ఫిట్‌గా ఉంటే 2050 నాటికి గ్లోబల్ ఎకానమీకి అదనంగా 11 ట్రిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.
కాబట్టి ఇప్పుడు కావాల్సింది కేవలం మందులు మాత్రమే కాదు, ప్రజల్లో అవగాహన , సరైన పోషకాహారం. పని చేసే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఆరోగ్యకరమైన సమాజం కోసం మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించాలి.
Krishnam Raju:రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మృతిలో సేవా యజ్ఞం.. డయాబెటిక్ పేషెంట్లకు నిజంగా వరమే..
