Space
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ఇప్పుడు ఒక అసాధారణ సంఘటనకు సాక్ష్యంగా నిలిచింది. పాతికేళ్లుగా నిరంతరాయంగా పరిశోధనలు సాగుతున్న ఈ పరిభ్రమిస్తున్న ప్రయోగశాల చరిత్రలో, మొట్టమొదటిసారిగా ఒక వైద్య అత్యవసర పరిస్థితి (Medical Emergency) వల్ల ఒక మిషన్‌ను షెడ్యూల్ కంటే ముందే ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. అనారోగ్యానికి గురైన ఒక వ్యోమగామిని కాపాడేందుకు.. నాసా (NASA) అత్యంత కీలకమైన ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంది.
ఏం జరిగింది? అసలు సమస్య ఏమిటి.. స్పేస్‌ఎక్స్ ‘క్రూ-11’ మిషన్‌లో భాగంగా 2025 ఆగస్టు 2న నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి(Space) చేరుకున్నారు. ఇందులో నాసాకు చెందిన జెనా కార్డ్‌మన్, మైక్ ఫింకేతో పాటు జపాన్ వ్యోమగామి కిమియా యుయి, రష్యన్ కాస్మోనాట్ ఒలేగ్ ప్లాటోనోవ్ కూడా ఉన్నారు. వీరంతా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి చివరి వరకు అక్కడే ఉండాల్సి ఉంది.
అయితే, జనవరి 7వ తేదీన ఆ నలుగురిలో ఒక వ్యోమగామికి ఊహించని విధంగా ఆరోగ్య సమస్య తలెత్తింది. వైద్య గోప్యత వల్ల ఆ వ్యోమగామి పేరును గానీ, సమస్య తీవ్రతను గానీ నాసా బయట పెట్టలేదు. కానీ, మైక్రోగ్రావిటీ (గురుత్వాకర్షణ లేకపోవడం) వల్ల కలిగే సాధారణ ఆరోగ్య సమస్యేనని చెబుతూ.., అయితే పూర్తి చికిత్స కోసం అత్యాధునిక వైద్య పరికరాలు అవసరమని దీనికోసం భూమిమీదకు తీసుకురావాలని నాసా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జె.డి. పోల్క్ స్పష్టం చేశారు.
సాధారణంగా అంతరిక్షం(Space)లో చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తితే అక్కడున్న మెడికల్ కిట్లు, ఇక్కడ ఉన్న వైద్యుల సలహాలతో సరిపెడతారు. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండటంతో, వ్యోమగాముల ప్రాణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. మిషన్‌ను నెలన్నర రోజుల ముందే రద్దు చేస్తున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మాన్ ప్రకటించారు. దీంతో జనవరి 8న జరగాల్సిన కీలకమైన ‘స్పేస్‌వాక్’ను కూడా తక్షణమే రద్దు చేశారు. అంతరిక్ష కేంద్రంలోని లైవ్ ఫీడ్లను కూడా కాసేపు నిలిపివేసి, వ్యోమగాములపై దృష్టి సారించారు.
ప్రస్తుతం అనారోగ్యానికి గురైన వ్యోమగామి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పిన నాసా మిగిలిన ముగ్గురు సభ్యులు కూడా క్షేమంగా ఉన్నారని తెలిపింది. వచ్చే 48 గంటల్లో వీరు స్పేస్‌ఎక్స్ డ్రాగన్ నౌకలో భూమికి తిరుగు ప్రయాణం కాబోతున్నట్లు చెప్పింది. జనవరి 10 నుంచి 12వ తేదీల మధ్య పసిఫిక్ మహాసముద్రంలో వీరు ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లోపు అంతరిక్ష కేంద్రం(Space)లో ఖాళీ ఏర్పడకుండా ఉండటానికి, తదుపరి మిషన్ అయిన ‘క్రూ-12’ లాంచ్‌ను ఫిబ్రవరి 15 కంటే ముందే నిర్వహించాలని నాసా భావిస్తోంది.
అంతరిక్ష ప్రయాణం ఎంత సాహసోపేతమైనదో, అక్కడ మనిషి ఆరోగ్యం ఎంత సున్నితమైనదో ఈ ఘటన మరోసారి నిరూపించింది. వ్యోమగాముల ప్రాణాలే ప్రథమ లక్ష్యంగా నాసా తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. అయితే ఇది భవిష్యత్తులో చంద్రుడు (Artemis), అంగారక గ్రహం (Mars) వంటి సుదీర్ఘ మిషన్లకు వెళ్లేటప్పుడు ఇలాంటి వైద్య సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్పే ఒక పాఠంగా ఈ సంఘటన నిలిచిపోబోతోంది.
Aadhaar card :ఆధార్ కార్డు చిటికెలో డౌన్‌లోడ్ .. ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పని కూడా లేదు
