Social Media Ban
స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియా వినియోగం(Social Media Ban) ఆందోళన కలిగించే స్థాయికి పెరిగింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పోటీ పడుతూ మరీ గంటల తరబడి ఈ డిజిటల్ ప్రపంచంలో గడుపుతున్నారు. దీనివల్ల, ముఖ్యంగా చిన్నారుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన ప్రపంచ దేశాల్లో మొదలైంది.దీంతోనే కొన్ని దేశాలు కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి.
ఈ విషయంలో మొట్టమొదటగా కఠిన నిర్ణయం తీసుకున్న దేశాల్లో ఒకటి ఆస్ట్రేలియా. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధించే(Social Media Ban) బిల్లును ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల తన చట్టసభల్లో ఆమోదించింది. ఈ కీలక బిల్లు వచ్చే నెల (డిసెంబర్ 10వ తేదీ) నుంచి అమల్లోకి రాబోతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఈ వయస్సు పరిమితికి లోబడిన ఖాతాదారులను తొలగించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఆయా సంస్థలకు భారీ జరిమానాలు విధించేలా ఆస్ట్రేలియా చట్టం రూపొందించింది.
ఆస్ట్రేలియా తీసుకున్న ఈ చర్యలను స్ఫూర్తిగా తీసుకుని, మరో ఆసియా దేశం మలేషియా కూడా ఇదే విధమైన కఠిన చర్యలకు ఉపక్రమించాలని యోచిస్తోంది. మలేషియా కమ్యూనికేషన్ మంత్రి ఫాహ్మి ఫడ్జిల్ తెలిపిన వివరాల ప్రకారం, 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆస్ట్రేలియా సహా ఇతర దేశాలు సోషల్ మీడియా(Social Media Ban)పై ఎలాంటి పరిమితులను విధిస్తున్నాయో తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నాటికి 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను తెరవకుండా నిషేధించే దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోందని, ఈ విషయంలో ప్రభుత్వం, తల్లిదండ్రులు ఇద్దరూ తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే.. సోషల్ మీడియాలో నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం, సైబర్ బెదిరింపులు (Cyberbullying), నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు పిల్లలలో మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. గంటల తరబడి యాప్‌లలో గడపడం వలన పిల్లలు చదువుపై, శారీరక కార్యకలాపాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు.
అపరిచితులతో పరిచయాలు, హానికరమైన కంటెంట్‌కు చేరువ కావడం, వ్యక్తిగత గోప్యతకు భంగం కలగడం వంటి సైబర్ నేరాల నుంచి పిల్లలను రక్షించడం అత్యవసరం.
ఇటీవల మలేషియాలో జరిగిన ఒక సర్వేలో 72 శాతం మంది ప్రజలు పిల్లలలో సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేయాలని అంగీకరించారు. ఇది ప్రభుత్వ నిర్ణయానికి బలం చేకూర్చింది.
పిల్లల సోషల్ మీడియా (Social Media Ban)వినియోగాన్ని నియంత్రించేందుకు కేవలం ఆస్ట్రేలియా, మలేషియా మాత్రమే కాకుండా ఇతర దేశాలు కూడా చొరవ చూపుతున్నాయి. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కూడా ఇదే తరహా బిల్లులను ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. డచ్ ప్రభుత్వం కూడా 15 ఏళ్లలోపు పిల్లలు టిక్‌టాక్, స్నాప్‌చాట్ వంటి యాప్‌లను ఉపయోగించకుండా నిషేధించాలని తల్లిదండ్రులకు సూచించింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలైన డెన్మార్క్, ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ వంటివి వినియోగదారుల వయస్సులను ధృవీకరించే యాప్‌ను పరీక్షిస్తున్నాయి.
ఈ నిర్ణయం వల్ల ఆందోళన, నిరాశ వంటి సమస్యలు తగ్గుతాయి, నిద్ర నాణ్యత పెరిగి మెరుగైన మానసిక ఆరోగ్యం దొరుకుతుంది. సోషల్ మీడియా నుంచి దృష్టి మళ్లింపు తగ్గడం వల్ల చదువుపై, సృజనాత్మకతపై ఎక్కువ సమయం కేటాయించొచ్చు.పిల్లలు హానికరమైన, అనుచితమైన కంటెంట్, సైబర్ బెదిరింపులు అసాంఘిక శక్తుల నుంచి సురక్షితంగా ఉంటారు.స్క్రీన్ సమయం తగ్గడం వల్ల ఆటలు, ఇతర శారీరక కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం పెరుగుతుంది.
అయితే సోషల్ మీడియా సంస్థలు వినియోగదారుల వయస్సును సరిగ్గా ధృవీకరించడం, నిబంధనలను ఉల్లంఘించకుండా చూడటం అనేది సాంకేతికంగా పెద్ద సవాలుగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాను మంచి విషయాల కోసం ఎలా ఉపయోగించాలో తెలియకుండానే పిల్లలు పూర్తిగా దూరం కావడం వలన డిజిటల్ ప్రపంచం గురించి తెలుసుకునే అవకాశం కోల్పోతారు.స్నేహితులతో కనెక్ట్ అవ్వడం, ప్రపంచ విషయాలు తెలుసుకోవడం వంటి ప్రయోజనాలను కోల్పోవచ్చు.
పిల్లలను డిజిటల్ యుగంలో సంరక్షించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు చాలా కీలకమైనవి. సైబర్ నేరాల పెరుగుదలను ఎదుర్కొనే క్రమంలో మలేషియా సైతం సోషల్ మీడియా సేవలపై తన పర్యవేక్షణను కఠినతరం చేస్తోంది. ప్రతి దేశం తమ పిల్లల భవిష్యత్తు, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలను పరిశీలించడం అవసరం.
