Salt flat
ఆకాశం భూమిపై ఉంటే ఎలా ఉంటుంది? భూమిపై ఒక అద్భుతమైన మార్పు వచ్చి అది మరో గ్రహంలా మారిపోతే ఎలా ఉంటుంది? ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద అద్దం ఎక్కడ ఉంది? ఇలాంటి ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం ఉంది. అదే బొలీవియాలో ఉన్న సాలార్ డి ఉయుని ఉప్పు మైదానం. ఇది కేవలం ఉప్పుతో నిండిన ఒక మైదానం కాదు, ఇది ప్రకృతి తన రెండు రూపాలను ఒకే చోట చూపించే అద్భుత ప్రదేశం. వేసవిలో కళ్లకు కనిపించనంత దూరంలో తెల్లటి ఉప్పు సాగరంగా, వర్షాకాలంలో భూమిపై ఆకాశాన్ని ప్రతిబింబించే భారీ అద్దంలా మారిపోయే ఈ ప్రదేశం, ప్రతి యాత్రికుడిని మంత్రముగ్ధులను చేస్తుంది.
భూమిపై అత్యంత అద్భుతమైన ప్రదేశాలలో ఒకటిగా సాలార్ డి ఉయుని, బొలీవియాలో ఆండీస్ పర్వతాల మధ్య సముద్ర మట్టానికి 3,650 మీటర్ల ఎత్తులో విరాజిల్లుతోంది. దాదాపు 10,582 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు మైదానం. సుమారు వెయ్యేళ్ల క్రితం ఇక్కడ లాగో మిన్చిన్ అనే ఒక భారీ సరస్సు ఉండేది. అది కాలక్రమంలో ఆవిరైపోవడంతో మిగిలిన ఉప్పు, సూర్యరశ్మికి ఎండిపోయి, ఈ అద్భుతమైన మైదానం(Salt flat)గా మారింది.
ఈ ఉప్పు మైదానం(Salt flat )యొక్క ప్రత్యేకత దాని రెంటి స్వభావంలో ఉంది. మే నుంచి నవంబర్ వరకు ఉండే వేసవి కాలంలో ఇది ఒక తెల్లటి, క్రిస్టల్-క్లియర్ ఉప్పు మైదానంగా దర్శనమిస్తుంది. దాని సమతలంగా ఉండే స్వభావం ఎంత పరిపూర్ణంగా ఉంటుందంటే, నాసా (NASA) తమ ఉపగ్రహ రాడార్‌లను సరిచేయడానికి దీనిని ఉపయోగిస్తుంది.
ఇక, డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉండే వర్షాకాలంలో, ఈ మైదానంపై ఒక పలుచటి నీటి పొర ఏర్పడుతుంది. ఆ సమయంలో ఇది భూమిపై అతిపెద్ద అద్దంగా మారి, ఆకాశాన్ని, సూర్యుడిని, మేఘాలను అత్యద్భుతంగా ప్రతిబింబిస్తుంది. పర్యాటకులు ఇక్కడ చేసే ఫొటోషూట్‌లు ఎంతో వైరల్ అవుతుంటాయి. ఈ మైదానాన్ని నడిచి, బైక్ మీద, లేదా 4WD కార్లలో పర్యటించొచ్చు. ఈ మైదానం మధ్యలో ఉన్న “ఇంకాహుయాసీ” అనే ద్వీపంపై జురాసిక్ కాలం నాటి పురాతన కాక్టస్ మొక్కలను చూడవచ్చు. ప్రతి సంవత్సరం వందల దేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఇది మంత్రముగ్ధులను చేస్తోంది.