Venezuelan president
అమెరికా, వెనుజులా మధ్య నెలకున్న ఉద్రిక్తతల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. వెనుజులాపై వైమానిక దాడులు చేసింది తామేనని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
అంతే కాకుండా ఈ దాడుల్లో వెనుజులా ప్రెసిడెంట్ (Venezuelan president) మదురోను బందీగా పట్టుకున్నామని ట్వీట్ చేశారు. ట్రంప్ చేసిన ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా అంతా షాక్ కు గురయ్యారు.
మదురోతో పాటు ఆయన భార్యను కూడా బంధించామంటూ ట్రంప్ చెప్పారు. డ్రగ్స్ కార్యకలాపాలకు వెనుజులా చిరునామాగా మారిపోయిందన్నారు. దీనికి మదురోనే కారణమని ట్రంప్ ఆరోపించారు.
వెనుజులా రాజధాని కారకస్‌లోనూ , మిరాండా, అరగువా, లా గైరా రాష్ట్రాలపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడులతో దక్షిణ కారకస్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత వెనుజులా ప్రెసిడెంట్ (Venezuelan president)మదురోను అదుపులోకి తీసుకున్నట్టు ట్రంప్ తన ప్రకటనలో వెల్లడించారు.
మదురోనూ , ఆయన భార్యను మరో ప్రాంతానికి తరలించినట్టు తెలిపారు. అయితే తమ దేశంలో విదేశీ మిలిటరీ జోక్యాన్ని వెనుజులా తీన్రంగా ఖండించింది. అంతర్జాతీయ సమాజం కూడా దీనిని ఆహ్వానించదని పేర్కొంది.
మరోవైపు తమ దేశంలోకి డ్రగ్స్ రవాణకు కారణంగా వెనుజులానేనని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. దీని వెనుక ఉన్నది కూడా ప్రెసిడెంట్ మదురో అంటూ ఆరోపిస్తున్నారు. దీనిని మదురో కూడా ఖండిస్తూనే వచ్చారు. ఈ పరిణామాలతోనే మదురోను దేశం విడిచి వెళ్లాలని కూడా ట్రంప్ హెచ్చరించారు. లేకుంటే దాడులు చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే దాడులు చేసి అధ్యక్షుడిని బంధించారు.
కొన్ని నెలలుగా వెనుజులా డ్రగ్స్ సామ్రాజ్యంపై అమెరికా దళాలు నిఘా ఉంచి దాడులు చేస్తున్నాయి, ఈ దాడులలో 100 మంది వరకూ మృతి చెందారు. డ్రగ్స్ రవాణా చేసే పడవలను కూడా అమెరికా దళాలు కొన్ని రోజులుగా ధ్వంసం చేస్తూ వచ్చాయి.
మరోవైపు వెనుజులా ప్రభుత్వం మాత్రం వీటిని ఖండిస్తోంది. తమ దేశంలో నిలువ ఉన్న అతిపెద్ద చములు నిల్వ కోసం వాటిని దక్కించుకోవడానికి అమెరికా కుట్రలు చేస్తోందని మండిపడుతోంది. ఇదిలా ఉంటే 2013లో హ్యూగో చావెజ్ చనిపోయిన తర్వాత మదురో అధికారం చేపట్టారు. ఆరేళ్లుగా ఆయన నాయకత్వంపై వివాదాలున్నాయి. అమెరికాతో సహా 50కి పైగా దేశాలు మదురోను చట్టబద్ధమైన నాయకుడిగా గుర్తించడం లేదు.
