HIV
ప్రపంచాన్ని దశాబ్దాలుగా భయపెడుతున్న HIV వ్యాధికి సరైన మందు లేదా వ్యాక్సిన్ ఇప్పటికీ లేదు. అయితే, శాస్త్రవేత్తలు తాజాగా ఒక కొత్త ప్రయోగాత్మక వ్యాక్సిన్‌తో ఆశలు రేకెత్తిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన మొదటి దశ ప్రయోగాలు విజయవంతంగా పూర్తయినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ టీకా mRNA టెక్నాలజీతో తయారు చేయబడింది. ఇదే టెక్నాలజీని గతంలో కోవిడ్-19 వ్యాక్సిన్‌ల తయారీలో కూడా వాడారు.
ఎయిడ్స్ (AIDS) అనేది వైరస్ వల్ల వచ్చే ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వైరస్ మనిషి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి, దాన్ని బలహీనపరుస్తుంది. దీంతో మనిషి శరీరం చిన్నపాటి జబ్బులతో కూడా పోరాడలేకపోతుంది. ఈ వైరస్‌కు ఇప్పటివరకు సరైన వ్యాక్సిన్ తయారు చేయలేకపోవడానికి ప్రధాన కారణం, ఈ వైరస్ తన రూపాన్ని తరచుగా మార్చుకోవడం. ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, దాని నిర్మాణం నిరంతరం మారుతూ ఉంటుంది. దీని వల్ల మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ లేదా సాధారణ యాంటీబాడీలు ఆ వైరస్‌ను గుర్తించలేవు. ఈ నిరంతర మార్పుల కారణంగానే ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా అన్ని రకాల HIV వైరస్‌లను అంతం చేయలేకపోతుంది.
ఈ కొత్త వ్యాక్సిన్ bnAb (broadly neutralizing antibody) అనే ఒక ప్రత్యేకమైన యాంటీబాడీని ఉత్పత్తి చేయగలుగుతుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. సాధారణ యాంటీబాడీలు ఒక రకం వైరస్‌ను మాత్రమే గుర్తించగలిగితే, bnAb యాంటీబాడీలు HIV వైరస్ తన రూపాన్ని ఎన్నిసార్లు మార్చుకున్నా దాన్ని గుర్తించి నాశనం చేయగలవు. అందుకే ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే, అది HIVకి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించగలదు.
ఈ కొత్త వ్యాక్సిన్ మొదటి దశ ప్రయోగాలు అమెరికా, ఆఫ్రికాలోని 108 మంది ఆరోగ్యవంతులపై నిర్వహించారు. ఈ ప్రయోగాలలో వచ్చిన ఫలితాలు చాలా సానుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే, ఈ టీకా ద్వారా కొంతమందిలో చర్మంపై కొన్ని ప్రతిచర్యలు కనిపించాయి. కానీ, అవి అంత ప్రమాదకరమైనవి కావని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ ప్రయోగాల ద్వారా, వ్యాక్సిన్‌ను ఇంకా ఎలా మెరుగుపరచాలి అనే విషయాలపై కూడా కొంత సమాచారం లభించింది. ఈ ఫలితాలు శాస్త్రవేత్తల్లో కొత్త ఆశలు రేకెత్తించినప్పటికీ, వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో విజయవంతం కావడానికి ఇంకా చాలా ప్రయోగాలు చేయాల్సి ఉంది.
నోట్: ఇది కేవలం ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం. ఏదైనా వైద్య చికిత్స లేదా నిర్ణయం తీసుకునే ముందు, తప్పనిసరిగా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Also Read: Black Tea: తెల్ల జుట్టును నల్లగా మార్చే సీక్రెట్ టీ ..మీకోసమే