Cigarette smokers
ధూమపానం (Cigarette smokers)ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ అలవాటు నేరుగా జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుందని, బట్టతలకు కారణమవుతుందని చాలా మందికి తెలియదు. 2024లో ప్రచురించబడిన మెటా-అనాలిసిస్ సహా అనేక పరిశోధనలు ఈ షాకింగ్ వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. రోజుకు ఒక్క సిగరెట్ తాగినా దాని ప్రభావం జుట్టుపై , చర్మంపై ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ధూమపానం(Cigarette smokers) చేసే పురుషుల్లో, ధూమపానం చేయని వారితో పోలిస్తే అండ్రోజెనెటిక్ అలోపీషియా (Pattern Baldness) వచ్చే ప్రమాదం 1.82 రెట్లు ఎక్కువగా ఉందని ఎనిమిది అధ్యయనాల డేటాను విశ్లేషించిన మెటా-అనాలిసిస్ స్పష్టం చేసింది.
రోజుకు 10 సిగరెట్ల కంటే తక్కువ వాడేవారిపై చేసిన మరో అధ్యయనం ప్రకారం, వారిలో సైతం బట్టతల వచ్చే ప్రమాదం 1.96 రెట్లు పెరుగుతున్నట్లు గుర్తించారు.
ఈ అధ్యయనాలు ధూమపానం చేసే అలవాటు తలపై వెంట్రుకలు లేదా జుట్టు పెరుగుదలను నేరుగా అడ్డుకుంటుందని, దీనికి ప్రధాన కారణం సిగరెట్ పొగలోని విషపదార్థాలే అని పేర్కొంటున్నాయి.
సిగరెట్ పొగలోని రసాయనాలు జుట్టు ఫాలికల్స్‌ను (Follicles) వివిధ మార్గాల్లో దెబ్బతీసి, జుట్టు రాలడానికి, అకాల వృద్ధాప్యానికి కారణమవుతాయి.
సిగరెట్ పొగలోని నికోటిన్ చర్మం రక్తనాళాలను సంకోచింపజేస్తుంది. దీనివల్ల స్కాల్ప్‌కు (తలపై చర్మానికి) అవసరమైన ఆక్సిజన్ , పోషకాలు సరిగా చేరవు. దీనితో ఫాలికల్స్ బలహీనపడి, జుట్టు పెరుగుదల ఆగిపోతుంది.
సిగరెట్ పొగలో ఉండే 7,000 పైగా రసాయనాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను విపరీతంగా విడుదల చేస్తాయి. ఇవి జుట్టు ఫాలికల్స్‌లోని కణాలను డ్యామేజ్ చేసి, జుట్టు రాలడానికి , పెళుసుగా (brittle) మారడానికి కారణమవుతాయి.
పొగలోని జనోటాక్సిన్స్ (Genotoxins) జుట్టు ఫాలికల్స్ డీఎన్ఏను దెబ్బతీస్తాయి. ఇది జుట్టు పెరుగుదల చక్రాన్ని (Hair Growth Cycle) దెబ్బతీసి, కొత్త జుట్టు పుట్టకుండా ఆపుతుంది.
ధూమపానం స్త్రీలు, పురుషులిద్దరిలోనూ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గించి, DHT (డైహైడ్రోటెస్టోస్టెరాన్) స్థాయిలను పెంచుతుంది. ఇది పురుషుల్లో తీవ్రమైన బట్టతలకు దారితీస్తుంది.
జుట్టు రాలడమే కాకుండా, ధూమపానం అకాల వృద్ధాప్యానికి కూడా దారితీస్తుంది.అంతేకాదు ధూమపానం చేయని వారితో పోలిస్తే, ధూమపానం చేసేవారిలో 30 ఏళ్లకు ముందే జుట్టు తెల్లబడే (నెరిసే) అవకాశం 2.5 నుంచి 4 రెట్లు ఎక్కువ ఉంది. దీనికి కారణం, పొగలోని విష పదార్థాలు జుట్టుకు రంగు ఇచ్చే మెలనిన్-ఉత్పత్తి చేసే కణాలను (Melanocytes) దెబ్బతీయడం.
ధూమపానం చేసే అలవాటు ఉన్నవారిలో చర్మ కణాల మరణం (Skin Tissue Death) , ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా, ధూమపానం అనేది కేవలం ఊపిరితిత్తులకే కాదు, మన రూపాన్ని , జుట్టును కూడా తీవ్రంగా దెబ్బతీసి, వృద్ధాప్యం త్వరగా వచ్చేలా చేసే ఒక ప్రమాదకరమైన అలవాటుగా అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.
