Water
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సంప్రదాయంగా ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆరోగ్యకరమైన అలవాట్లను వదిలేస్తున్నారు. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకూడదని పెద్దలు చెబుతుంటారు. అయినా కూడా, చాలా మంది అన్నం తింటున్నప్పుడూ నీళ్లు(Water) తాగుతుంటారు. అయితే ఇలా చేయడం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
భోజన సమయంలో నీళ్లు తాగితే వచ్చే సమస్యలు.. భోజన సమయంలో ఎక్కువగా నీళ్లు తాగితే లేనిపోని అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి విడుదలైన జీర్ణరసాలు (Digestive Juices) పలుచబడిపోయే అవకాశం ఉంది. దీంతో ఆహారం జీర్ణం అయ్యేందుకు సాధారణం కంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది.
దీని ద్వారా తేన్పులు, అజీర్తి (Indigestion), కడుపు ఉబ్బరం (Bloating), మలబద్ధకం లాంటి సమస్యల ముప్పు పొంచి ఉంటుంది. భోజనానికి ముందు నీరు ఎక్కువగా తాగితే శరీరానికి శక్తి తగ్గి బలహీనంగా మారే అవకాశం ఉంది. అలాగే భోజనం అయిన వెంటనే ఎక్కువ నీరు తాగినప్పుడు అది స్థూలకాయానికి (Obesity) దారితీస్తుంది.
సరైన పద్ధతి ఏమిటి?: భోజన సమయంలో నీరు తాగేప్పుడు కొన్ని మార్గాలు అనుసరించాల్సి ఉంటుంది. భోజనం చేసే సమయంలో ఒకేసారి ఎక్కువ నీరు తాగకుండా, సిప్ చేస్తున్నట్లుగా కొద్దికొద్దిగా మాత్రమే తాగాలి. ఇలా తీసుకున్న నీరు మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అలాగే, భోజనం చేసేటప్పుడు వెచ్చని నీటిని (Warm Water) తీసుకుంటే శరీరంలో జీర్ణక్రియ త్వరగా జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన అరగంట తర్వాత నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది.