Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బరిలో ఆర్ఆర్ఆర్ రైతులు.. ముగిసిన నామినేషన్ల గడువు
Jubilee Hills by-election: నవంబర్ 11న బిహార్ రెండో దశ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కూడా పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటింతనున్నారు.

Jubilee Hills by-election
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మృతితో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-election)కు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. మంగళవారం మద్యాహ్నం 3 గంటల వరకూ క్యూ లైన్ లో ఉన్నవారికి నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించారు. ఊహించినట్టుగానే ఈ బైపోల్(Jubilee Hills by-election) ద్వారా అధికార పార్టీ కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టేందుకు రీజనల్ రింగురోడ్డు బాధిత రైతులు సిద్ధమయ్యారు. చివరిరోజు బాధిత రైతులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు.
కేవలం ఆర్ఆర్ఆర్ బాధిత రైతులే కాదు రిటైర్డ్ ఉద్యోగులు, ఓయూ విద్యార్థులు కూడా పోటీకి దిగారు. ప్రభుత్వం దృష్టికి తమ ఆవేదన తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే వీరంతా జూబ్లీహిల్స్ బైపోల్ ను వేదికగా ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. 180కి పైగా నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం. బుధవారం నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుండగా.. విత్ డ్రాకు తుది గడువు అక్టోబర్ 24గా ఉంది.

నవంబర్ 11న బిహార్ రెండో దశ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కూడా పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటింతనున్నారు. మూడు రోజుల క్రితం వరకూ వంద లోపే నామినేషన్లు దాఖలవగా.. చివరిరోజు ఒక్కసారే 80 వరకూ నామినేషన్లు వచ్చాయి. రీజనల్ రింగురోడ్డుకు సంబంధించి.. అన్యాయంగా అలైన్ మెంట్ మార్చడం ద్వారా తమకు నష్టం చేస్తున్నారని నిరసన తెలుపుతూ బాధిత రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడాన్ని నిరసిస్తూ కొందరు రిటైర్డ్ ఉద్యోగులు నామినేషన్లు వేశారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంటే…తమ పాలనకు రెఫరెండంగా భావిస్తూ జూబ్లీహిల్స్ లో జెండా ఎగరేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ వ్యూహంతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో చెక్కుచెదరన తమ ఓటు బ్యాంకును నమ్ముకుంది.
గోపీనాథ్ భార్య సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించిన గులాబీ పార్టీ కాంగ్రెస్ అమలు చేయని హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తోంది. హైడ్రా బాధితుల ఆవేదన, ఇందిరమ్మ ఇళ్లు ఆలస్యం వంటి అంశాలతో ప్రచారంలో ముందుకు సాగుతోంది. మరోవైపు తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని కాంగ్రెస్ నమ్ముతోంది.

పైగా బీసీలకే టికెట్ కేటాయించి నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది. 2014 ఎన్నికల్లో ఎంఐఎం తరపున పోటీ చేసిన నవీన్ యాదవ్ గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఇదిలా ఉంటే బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపునే పోటీ చేసిన దీపక్ రెడ్డి మూడో స్థానం సాధించారు. కానీ ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.