Intelligence: మీ తెలివితేటలపై మీకే అనుమానమా? అది మీ తప్పు కాదు..

Intelligence: ఎవరైనా వారిని మెచ్చుకుంటే, అది కేవలం వారు మొహమాటానికి చెబుతున్నారని లేదా తనలో ఏదో గొప్పతనం ఉందని భ్రమపడుతున్నారని అనుకుంటారు.

Intelligence

చాలా మంది తమ జీవితంలో గొప్ప విజయాలు సాధించినా, ఉన్నత పదవుల్లో ఉన్నా.. లోలోపల ఒక విధమైన భయంతో బతుకుతుంటారు. “నేను ఈ విజయానికి నిజంగా అర్హుడినేనా? లేక అదృష్టం కొద్దీ ఇది నాకు దక్కిందా? నా అసమర్థత ఎక్కడైనా బయటపడిపోతుందేమో!” అనే ఆందోళన వారిని వెంటాడుతుంటుంది. మనస్తత్వ శాస్త్రంలో దీన్నే ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’ (Imposter Syndrome) అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక దశలో ఈ భావనకు లోనవుతారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది కేవలం ఒక మానసిక స్థితి మాత్రమే కాదు, ఒక వ్యక్తి ఎదుగుదలను అడ్డుకునే అతిపెద్ద శత్రువు.

ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు తమ నైపుణ్యాన్ని(Intelligence) తామే తక్కువ అంచనా వేసుకుంటారు. ఎవరైనా వారిని మెచ్చుకుంటే, అది కేవలం వారు మొహమాటానికి చెబుతున్నారని లేదా తనలో ఏదో గొప్పతనం ఉందని భ్రమపడుతున్నారని అనుకుంటారు. ముఖ్యంగా కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు లేదా పెద్ద ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినప్పుడు ఈ భావన ఎక్కువగా కలుగుతుంది. “నన్ను పొరపాటున సెలెక్ట్ చేశారు, నాకంటే తెలివైన వారు చాలా మంది ఉన్నారు, రేపు పని చేసేటప్పుడు నా అసలు రంగు బయటపడుతుంది” అని భయపడుతుంటారు. దీనివల్ల వారు తమను తాము నిరూపించుకోవడానికి అవసరానికి మించి కష్టపడతారు, ఇది చివరికి మానసిక ఒత్తిడికి (Burnout) దారితీస్తుంది.

ఈ సిండ్రోమ్‌లో ఐదు రకాల వ్యక్తులు ఉంటారని నిపుణులు వివరిస్తున్నారు. మొదటి రకం ‘పర్ఫెక్ట్ నిస్ట్’. వీరు తాము చేసే పనిలో చిన్న తప్పు దొర్లినా తట్టుకోలేరు, అది తమ అసమర్థతకు నిదర్శనమని భావిస్తారు. రెండో రకం ‘సూపర్ ఉమెన్/సూపర్ మాన్’. వీరు ఇతరుల దృష్టిలో తాము గొప్పగా కనిపించాలని విపరీతంగా శ్రమిస్తారు. మూడో రకం ‘నేచురల్ జీనియస్’. ఏదైనా విషయాన్ని మొదటి ప్రయత్నంలోనే నేర్చుకోలేకపోతే, తమకు తెలివితేటలు(Intelligence) లేవని బాధపడతారు. నాలుగో రకం ‘సోలోయిస్ట్’. ఎవరి సహాయం తీసుకోకుండా పని పూర్తి చేయాలని అనుకుంటారు, సహాయం అడిగితే అది బలహీనత అని నమ్ముతారు. ఐదో రకం ‘ఎక్స్‌పర్ట్’. ఒక విషయం గురించి ప్రతిదీ తెలిస్తేనే తాము అర్హులమని భావిస్తారు.

Intelligence

ఈ ఇంపోస్టర్ సిండ్రోమ్ నుండి బయటపడాలంటే ముందుగా మన ఆలోచనా సరళిని మార్చుకోవాలి. మీ విజయాలు అదృష్టం వల్ల వచ్చినవి కావు, మీ కష్టం , నైపుణ్యం(Intelligence) వల్లే వచ్చాయని గుర్తించాలి. మీ మనసులో కలిగే ఈ భయాలను నమ్మకమైన స్నేహితులతో లేదా మెంటార్లతో పంచుకోవాలి. ఇలా మాట్లాడటం వల్ల మీలాంటి భావనలే చాలా మందికి ఉన్నాయని తెలిసి మీలో ధైర్యం పెరుగుతుంది. అలాగే, తప్పులు చేయడం మనిషి సహజమని, అది నేర్చుకోవడంలో ఒక భాగమని అంగీకరించాలి. ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రయాణం విభిన్నంగా ఉంటుంది.

గుర్తుంచుకోండి మీరు ఉన్న స్థానానికి మీరు అర్హులు కాబట్టే అక్కడ ఉన్నారు. మీ మెదడు మిమ్మల్ని భయపెట్టాలని చూసే ఈ ‘ఇంపోస్టర్’ ఆలోచనలను సవాలు చేయండి. మీ శక్తి సామర్థ్యాల మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే మీరు ఇంకా ఎత్తుకు ఎదగగలరు. ఇది కేవలం ఒక మానసిక అడ్డంకి మాత్రమే, దీన్ని దాటడం మీ చేతుల్లోనే ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version