Hair Care
జుట్టు రాలడం అనేది కేవలం అందానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది మన ఆరోగ్యం గురించి కూడా ఎన్నో విషయాలను చెబుతుంది. సాధారణంగా రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం అనేది చాలా సహజమైన ప్రక్రియ. కానీ అంతకంటే ఎక్కువ మొత్తంలో జుట్టు రాలుతున్నా లేదా కొత్త జుట్టు రావడం ఆగిపోయినా అప్పుడు మనం కచ్చితంగా (Hair Care)జాగ్రత్త పడాలి.
జుట్టు ఊడిపోవడానికి ప్రధాన కారణాల్లో వంశపారంపర్యం ఒకటి. మీ కుటుంబంలో పెద్దలకు బట్టతల లేదా జుట్టు పల్చబడటం వంటి సమస్యలు ఉంటే అది మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటు హార్మోన్ల అసమతుల్యత కూడా ఒక ముఖ్య కారణం. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు లేదా మహిళల్లో పీసీఓడీ వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు జుట్టు విపరీతంగా రాలుతుంది. మన శరీరంలో హార్మోన్ల స్థాయిలో మార్పులు వచ్చినప్పుడు వెంట్రుకల కుదుళ్లు బలహీనపడతాయి.
ఆహారపు అలవాట్లు కూడా జుట్టు ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. మన జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు తక్కువగా ఉన్నా లేదా ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత ఉన్నా జుట్టు రాలడం మొదలవుతుంది. మన రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే జుట్టు కుదుళ్లకు అందాల్సిన ఆక్సిజన్ , పోషకాలు సరిగ్గా అందవు. దీనివల్ల జుట్టు నిర్జీవంగా మారి రాలిపోతుంది.
అలాగే విటమిన్ డి, విటమిన్ బి12 ,జింక్ వంటి పోషకాలు తగ్గడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. కేవలం అంతర్గత కారణాలే కాదు, మనం వాడే షాంపూలు, కెమికల్స్, మరియు వాతావరణ కాలుష్యం కూడా జుట్టును దెబ్బతీస్తాయి. జుట్టుకు రంగులు వేయడం, అతిగా హీట్ స్టైలింగ్ చేయడం వల్ల వెంట్రుకల లోపల ఉండే తేమ పోయి అవి చిట్లిపోతుంటాయి.
మానసిక ఒత్తిడి , అతిగా ఆలోచించడం కూడా జుట్టు రాలడానికి (Hair Care)ఒక ప్రధాన కారణం. దీనిని వైద్య పరిభాషలో ‘టెలోజెన్ ఎఫ్లూవియం’ అని పిలుస్తారు. మనం తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మన శరీరంలోని వెంట్రుకలు పెరిగే దశ నుండి రాలిపోయే దశకు త్వరగా చేరుకుంటాయి. అంటే మానసిక ప్రశాంతత లేకపోతే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉండదు.
అందుకే మీరు ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. అలాగే నిద్రలేమి కూడా జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. రాత్రిపూట కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల గాఢనిద్ర ఉంటేనే శరీరం జుట్టు కుదుళ్లను రిపేర్ చేసుకుంటుంది. నీరు తక్కువగా తాగడం వల్ల కూడా జుట్టు పొడిబారి రాలిపోతుంది. జుట్టు కుదుళ్లు హైడ్రేటెడ్ గా ఉండాలంటే రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగాలి.
జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడానికి డాక్టర్లు ఇచ్చే ప్రధాన సలహా ఏంటంటే, ముందుగా మీరు రసాయనాలు తక్కువగా ఉన్న షాంపూలను ఎంచుకోవాలి. సల్ఫేట్ పారాబెన్ లేని మైల్డ్ షాంపూలు వాడటం మంచిది. వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు అతిగా వేడిగా ఉండే నీటిని అస్సలు వాడకూడదు, ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. గోరువెచ్చని నీరు లేదా చల్లని నీటితో స్నానం చేయడం ఉత్తమం.
వారానికి ఒకసారి కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి జుట్టు ఎదుగుదల బాగుంటుంది. అలాగే ఉల్లిపాయ రసం లేదా కలబంద గుజ్జును తలకు పట్టించడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుకు రక్షణ ఇస్తాయి.
ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యను కంట్రోల్ (Hair Care)చేయొచ్చు. మీ రోజూవారీ ఆహారంలో గుడ్లు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూర ఉండేలా చూసుకోవాలి. బాదం, అక్రోట్ వంటి డ్రై ఫ్రూట్స్ లో జుట్టుకు కావాల్సిన జింక్ , ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఉసిరికాయను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల విటమిన్ సి అందుతుంది. ఇది జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.
డాక్టర్ల సలహాతో బయోటిన్ లేదా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు (Hair Care)కూడా వాడొచ్చు. అయితే సమస్య మరీ ఎక్కువగా ఉంటే, అంటే తల మీద ప్యాచెస్ లాగా జుట్టు ఊడిపోతుంటే వెంటనే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాలి. వారు మీ రక్త పరీక్షలు చేసి లోపం ఎక్కడ ఉందో కనుగొని మినాక్సిడిల్ వంటి లోషన్లు లేదా పిఆర్పి వంటి ట్రీట్మెంట్లను సూచిస్తారు. ఏది ఏమైనా జుట్టు రాలడం అనేది రాత్రికి రాత్రే తగ్గదు, కనీసం మూడు నెలల పాటు ఓపికగా జాగ్రత్తలు పాటిస్తేనే మంచి ఫలితం కనిపిస్తుంది.
