Hair loss
జుట్టు రాలడం అనేది చాలామందిని కలవరపెట్టే సమస్య. స్ట్రెస్, పోషకాహార లోపం, హార్మోన్ల మార్పులు,వాతావరణ కాలుష్యం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఈ సమస్యకు పరిష్కారం కేవలం బయటి నుంచి కాదు, లోపలి నుంచి కూడా ఉండాలి. సమగ్రమైన పోషణ, సరైన సంరక్షణతో జుట్టు రాలే(hair loss) సమస్యకు మనం చెక్ పెట్టవచ్చు.
మన జుట్టు ఆరోగ్యం మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. జుట్టు మూలాలు బలపడాలంటే ప్రోటీన్స్ అత్యంత అవసరం. గుడ్లు, పాలు, పప్పుధాన్యాలు, చికెన్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి జుట్టుకు కావలసిన కెరాటిన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. అలాగే, విటమిన్-ఇ, విటమిన్-సి, ఐరన్ ఉన్న ఆహారం జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. ఆకుకూరలు, క్యారెట్లు, బాదం, నారింజ వంటివి మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.
జుట్టు రాలడాన్ని(hair loss) తగ్గించడానికి నూనె మసాజ్ ఒక అద్భుతమైన మార్గం. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె జుట్టు మూలాలను బలంగా చేస్తాయి. ఈ నూనెలను గోరువెచ్చగా చేసి తలకు సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు కుదుళ్లకు పోషణ అందించి, రాలడాన్ని తగ్గిస్తుంది. వారానికి కనీసం రెండు సార్లు ఇలా చేయడం మంచిది.
హోమ్ రెమెడీస్: జుట్టుకు సహజ ప్యాక్స్..
ఉల్లిపాయ రసం.. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని తీసి తలకు అప్లై చేసి, ఒక గంట తరువాత కడిగేయాలి. ఇది కొద్దిగా ఘాటుగా ఉన్నా, జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడుతుంది.
గుడ్డులోని తెల్లసొన.. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. గుడ్డు తెల్లసొనను ఆలివ్ ఆయిల్‌తో కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకోవడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది.
కలబంద (అలోవెరా) జెల్: అలోవెరాలో ఉండే విటమిన్స్, మినరల్స్ జుట్టుకు ఒక కండిషనర్‌లా పనిచేస్తాయి. ఇది జుట్టు పొడిబారకుండా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మెంతులు, పెరుగు: మెంతులను పెరుగులో నానబెట్టి దానిని మిక్సీ పట్టి ఆ పేస్టును తలకు అప్లై చేసి అరగంట తర్వాత తలకు స్నానం చేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.
ఒత్తిడి నివారణ.. అధిక ఒత్తిడి జుట్టు రాలడానికి(hair loss) ఒక ప్రధాన కారణం. యోగా, ధ్యానం,వ్యాయామం వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
సరైన నిద్ర.. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. నిద్రలో మన శరీరం తనను తాను పునరుత్తేజం చేసుకుంటుంది, ఇది జుట్టుకు కూడా వర్తిస్తుంది.
రసాయనాలకు దూరం.. జుట్టుకు వేడి చేసే పరికరాలు (హెయిర్ స్ట్రెయిట్‌నర్, డ్రయర్), రసాయనాలు అధికంగా ఉండే హెయిర్ కలర్స్, ప్రొడక్ట్స్ వాడటం తగ్గించాలి. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే, జుట్టు రాలేసమస్య తగ్గుతుంది మరియు మీ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.