Psychology: నువ్వు బాగుండాలి..కానీ నాకంటే కాదు! మనుషుల్లో పెరుగుతున్న వింత సైకాలజీకి కారణమేంటి?

Psychology: పక్కవాడు ఎప్పుడూ కష్టాల్లో ఉండాలని కోరుకుంటారు. వాడు బాధలో ఉన్నప్పుడు వెళ్లి ఓదారుస్తూ, సలహాలిస్తూ ఉంటే వాళ్లకు ఒక రకమైన ఈగో శాటిస్ఫాక్షన్ కలుగుతుంది.

Psychology

మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు పది మంది వచ్చి పలకరిస్తారు, ఓదారుస్తారు. కానీ అదే మనిషి విజయం సాధించి నాలుగు మెట్లు పైకి ఎక్కుతుంటే, అదే పది మందిలో ఎంతమంది మనస్ఫూర్తిగా చప్పట్లు కొడతారు అనేదే పెద్ద ప్రశ్న.

నువ్వు బాగుండాలి.. కానీ నాకంటే ఎక్కువ కాదు” అనే ఒక వింతైన, ప్రమాదకరమైన ఆలోచనా ధోరణి(Psychology) ఇప్పుడు మనుషుల్లో ప్రబలిపోతోంది. విచిత్రం ఏమిటంటే, ఈ ఈర్ష్య లేదా అసూయ అనేది ఎక్కడో ఉన్న శత్రువుల దగ్గర కాదు.. మన బంధువుల్లోనే, మన స్నేహితుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది.

మనిషి మెంటాలటీని అధ్యయనం చేసే నిపుణులు దీనిని క్రాబ్ మెంటాలిటీ (ఎండ్రకాయల మనస్తత్వం) అని పిలుస్తారు. దీనికి ఉదాహరణగా ఒక బుట్టలో కొన్ని ఎండ్రకాయలను వేసినప్పుడు, అందులో ఒకటి పైకి ఎగబాకి బయటపడాలని చూస్తుంటే, మిగిలినవి దాన్ని ప్రోత్సహించవు సరే కదా.. దాని కాళ్లు పట్టుకుని కిందకు లాగుతాయి. చివరికి ఏ ఒక్కటీ బయటపడదు. మనుషుల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పక్కవాడు తనను మించిపోతున్నాడనే భయం, తన కంటే వాడు ఎక్కువ గౌరవం పొందుతున్నాడనే ఈర్ష్య మనిషిని లోపల కాల్చేస్తుంటాయట. సైకాలజీ(Psychology) ప్రకారం దీనిరి లో -సెల్ఫ్ ఎస్టీమ్ (తక్కువ ఆత్మవిశ్వాసం) అని అంటారు. తనను తాను తక్కువగా చూసుకునే మనిషి, ఎదుటివాడు ఎదిగితే తట్టుకోలేడు.

మనుషులు చాలావరకూ పక్కవాడెప్పుడూ కష్టాల్లో ఉండాలని కోరుకుంటారు. వాడు బాధలో ఉన్నప్పుడు వెళ్లి ఓదారుస్తూ, సలహాలిస్తూ ఉంటే వాళ్లకు ఒక రకమైన ఈగో శాటిస్ఫాక్షన్ (అహం తృప్తి) కలుగుతుంది. నేను వాడి కంటే పైన ఉన్నాను, వాడు నా దగ్గరకు సాయం కోసం వచ్చాడనే ఒక తప్పుడు గర్వం వాళ్లలో సంతృప్తిని నింపుతుంది.

Psychology

కానీ అదే మనిషి తన సొంత కష్టంతో ఎదిగి, నీ సలహాలు అవసరం లేని స్థాయికి వెళ్లినప్పుడు ఆ మనుషులు తట్టుకోలేరు. అప్పటివరకు సాయం చేసిన మనుషులే, ఇప్పుడు లోపల అసూయతో కుళ్లిపోతుంటారట. వారి పట్ల తెలియని కోపాన్ని పెంచుకుంటారు లేదా వారి ఎదుగుదలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తారని మానసిక నిపుణులు వివరిస్తున్నారు

బంధువులు, స్నేహితుల మధ్యే ఇది ఎందుకు అంటే.. మనం ఎప్పుడూ తెలియని వ్యక్తులతో పోటీ పడము. మనతో సమానంగా ఉన్నవారిని చూసి లేదా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు ఎదిగినప్పుడే ఈ ఈర్ష్య మొదలవుతుంది.వీడు నిన్నటి వరకు మనతో తిరిగినవాడే కదా, ఇప్పుడేంటి ఇంత పెద్దవాడైపోయాడనే భావన బంధువుల్లో, స్నేహితుల్లో మొదలవుతుంది.

మన విజయాన్ని వారు తమ ఓటమిగా భావిస్తారు. ఎదుటివారి ప్రతిభను గుర్తించడానికి మనిషికి చాలా పెద్ద మనసు ఉండాలి. కానీ మన సమాజం మనుషులను ఎప్పుడూ ఒకరితో ఒకరిని పోల్చడం నేర్పిస్తుంది తప్ప, ఒకరి ఎదుగుదలను చూసి సంతోషించడం నేర్పించదు.

అందుకే ప్రతీ ఒక్కరూ తమ మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని అనుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్క నిమిషం కళ్లు మూసుకుని ఆలోచించండి. మీ ఆత్మీయులు ఎవరైనా ఒక విజయం సాధించినప్పుడు మీకు నిజంగా సంతోషం కలిగిందా? లేక లోపల ఎక్కడో చిన్న అసూయ రేగిందా అని ప్రశ్నిస్తున్నారు.

సంతోషంలో తోడుండటం కంటే.. పక్కవాడి ఎదుగుదలను చూసి మురిసిపోయే గుణం కూడా అందరిలో ఉండాలి. ఎదుటివారి ఎదుగుదలకు తోడ్పడటం వల్ల మనం తగ్గిపోం. నిజానికి, పక్కవాడు ఎదిగితే ఆ క్రెడిట్ లో మనకు కూడా భాగం ఉంటుందన్న ఆలోచన రావాలి. ఇంకా చెప్పాలంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేలా ఉండాలి.

మన చుట్టూ ఉన్నవాళ్లు బాగుంటే, మనకు తెలియకుండానే ఆ సానుకూలత మన జీవితాల్లోకి కూడా వస్తుంది. లోకమంతా బాధల్లో ఉంటే మనం మాత్రం సుఖంగా ఎలా ఉండగలం? బంధుత్వాలు, స్నేహాలు అనేవి కేవలం అవసరాలకు లేదా ఓదార్పులకు పరిమితం కాకూడదు.

ఒకరి చేతిని పట్టుకుని పైకి తీసుకువచ్చినప్పుడే ఏ బంధానికి అయినా ఒక అర్థం ఉంటుంది. ఈర్ష్య అనే విషాన్ని వదిలేసి, ఆత్మీయత, చేయూతను పంచుకోండి. అప్పుడే మనిషి అనే పదానికి సరైన నిర్వచనం లభించి ఈ ఎండ్రకాయల మనస్తత్వానికి చెక్ పెట్టగలం అంటున్నారు సైకాలజిస్టు(Psychology)లు.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version