Neck Pain
ప్రస్తుత కాలంలో మెడనొప్పి (Neck Pain) సర్వసాధారణ సమస్యగా మారింది. ఇది కేవలం పెద్దవాళ్లనే కాకుండా, యువతను కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్య ఉన్నవారు తమ రోజువారీ, ఆఫీసు పనులను కూడా సక్రమంగా చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ నొప్పి తీవ్రమై సర్జరీ వరకు వెళ్లాల్సిన ప్రమాదం ఉంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దాదాపు 90 శాతం మంది మెడనొప్పి సమస్యను ఎదుర్కోవడానికి ప్రధాన కారణాలు వారి పనిచేసే తీరు కూర్చునే విధానమేనట.
ఆఫీసుల్లో లేదా ఇంట్లో కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం వల్ల మెడపై చెడు ప్రభావం పడి నొప్పి వస్తుంది.
వాహనాలను ఎక్కువగా నడిపే వారు కూడా మెడనొప్పిని ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో భుజాలు, మణికట్టు సరైన దిశలో పెట్టకపోవడం కూడా దీనికి కారణం. నిద్రపోయే పొజిషన్ సరిగ్గా లేకున్నా, మెడకు సరైన సపోర్ట్ లభించకపోయినా ఉదయం మెడనొప్పి వేధిస్తుంది.
మెడనొప్పిని తేలికగా తీసుకుంటే, అది తీవ్రమై స్పాండిలైటిస్ (Spondylitis)కు దారితీసే అవకాశం ఉంది. ఈ నొప్పి మరింత ఎక్కువైతే, చివరికి నెక్ సర్జరీ వరకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండేందుకు లేదా తీవ్రం కాకుండా ఉండేందుకు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మెడనొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కంప్యూటర్ల ముందు పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోచేతులు , భుజాలు సమాంతరంగా ఉండేట్టు చూసుకోవాలి. అలాగే, మణికట్టు కీబోర్డుకు సమాంతరంగా ఉండేట్టు చూసుకోవాలి.
టూ వీలర్ డ్రైవ్ చేసేవారు బైక్ పై నిటారుగా కూర్చోవాలి. భుజాలు మెడకు సమాంతరంగా ఉంచి డ్రైవింగ్ చేయాలి.మెడనొప్పి ఉండేవాళ్లు కచ్చితంగా రోజుకు నాలుగైదు సార్లు మెడకు సంబంధించిన ఎక్సర్‌సైజెస్ చేయాలి. మెడను నెమ్మదిగా అన్ని దిశల్లో కదపడం (Neck Rotation) వంటివి చేయవచ్చు.
ఒకే దగ్గర గంటల కొద్దీ కూర్చోవద్దు. ఎంత పని ఉన్నా, మధ్య మధ్యలో లేచి అటూ ఇటూ నడవడం లేదా నిలబడటం అలవాటు చేసుకోవాలి.
పనితీరు, జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ మెడనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
స్పాండిలైటిస్‌కు దారి తీయకముందే… కంప్యూటర్, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.