Cooking oil
మనం వంటకు వాడే నూనె మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. మార్కెట్‌లో అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నా, తెలుగువారు ఎక్కువగా ఉపయోగించే కొన్ని ముఖ్యమైన నూనెల ప్రయోజనాలను, వాటిని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సన్‌ఫ్లవర్ ఆయిల్..ఈ నూనె సాధారణంగా అన్ని రకాల వంటలకు ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్-ఈ అధికంగా ఉంటుంది. కానీ, ఈ నూనెకు స్మోక్ పాయింట్ తక్కువగా ఉంటుంది. అంటే, దీన్ని ఎక్కువ టెంపరేచర్ వరకూ వేడి చేసినప్పుడు దాని పోషక విలువలు తగ్గిపోతాయి. కాబట్టి డీప్ ఫ్రై వంటి అధిక ఉష్ణోగ్రత అవసరమయ్యే వంటలకు ఇది అంతగా మంచిది కాదు.
రైస్ బ్రాన్ ఆయిల్..రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ముఖ్యంగా ఒరిజానోల్ అనే యాంటీఆక్సిడెంట్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు కాబట్టి, డీప్ ఫ్రై చేయడానికి ఇది మంచి ఎంపిక.
ఆవాల నూనె..ఆవాల నూనె గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనికి ఒక ప్రత్యేకమైన ఘాటైన వాసన ఉంటుంది, అందుకే ఇది ఎక్కువగా ఉత్తర భారత వంటకాలలో ఉపయోగిస్తారు.
వేరుశనగ నూనె..వేరుశనగ నూనె అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. ఇది డీప్ ఫ్రై చేయడానికి మంచిది. ఈ నూనెలో అసంతృప్త కొవ్వులు (unsaturated fats) అధికంగా ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
వంట నూనె(Cooking oil)ను ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు కూడా కొన్ని ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవి
స్మోక్ పాయింట్.. ఏ నూనెను ఎంత ఉష్ణోగ్రత వరకు వేడి చేయవచ్చో తెలుసుకోవడం చాలా ముఖ్యం. డీప్ ఫ్రై వంటి అధిక ఉష్ణోగ్రత వంటకాలకు అధిక స్మోక్ పాయింట్ ఉన్న నూనెలను ఎంచుకోవాలి.అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు ఉన్న నూనెలను ఎంచుకోవడం మంచిది.
చివరగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎప్పుడూ ఒకే రకం నూనె వాడకుండా, వేర్వేరు నూనెల(Cooking Oil)ను మార్చి మార్చి వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందేలా చూసుకోవచ్చు.