Leaves :ఆకులు చెప్పే జీవితపాఠాలు ఇవే..

Leaves : లోకంలో ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంటుంది, కానీ ఆ ప్రత్యేకత తన వల్లే కలిగింది అని అహంకారం ప్రదర్శిస్తే పతనం తప్పదు.

Leaves

మన చుట్టూ ఉన్న ప్రకృతి తెలీకుండానే మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. ముఖ్యంగా మనం రోజూ చూసే వివిధ రకాల ఆకుల(Leaves) ద్వారా భగవంతుడు మనిషికి ఉండాల్సిన అతి ముఖ్యమైన గుణం వినయం అని గుర్తు చేస్తూనే ఉన్నాడు. లోకంలో ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంటుంది, కానీ ఆ ప్రత్యేకత తన వల్లే కలిగింది అని అహంకారం ప్రదర్శిస్తే పతనం తప్పదని ఈ ఆకుల(Leaves) కథ ద్వారా మనకు అర్ధం చేసుకోవాలి.

ముందుగా మామిడి ఆకు తన ప్రాముఖ్యతను చాటుకుంటూ, ఏ శుభకార్యం జరిగినా తన ఉనికి తప్పనిసరి అని, తాను లేనిదే పవిత్రత రాదని గర్వంగా చెప్పిందట. అప్పుడు భగవంతుడు నవ్వి, ఆ అహంకారాన్ని అణచడానికే మామిడి ఆకును ఇంటి గుమ్మానికి తలక్రిందులుగా వేలాడదీసే స్థితిని కల్పించాడు. అంటే ఎంత గొప్ప వారైనా వినయం లేకపోతే వారి స్థానం తలక్రిందులు అవుతుందని దీని అంతరార్థం అన్నమాట.

మామిడి ఆకు

ఆ తర్వాత కరివేపాకు వంతు వచ్చింది. వంటల్లో తన రుచి లేకపోతే భోజనం పూర్తి కాదని, తన అరోమా ప్రపంచంలోనే అతి గొప్పదని గర్వపడిందట. దీనికి సమాధానంగా దేవుడు వంటలో కరివేపాకు తన రుచిని ఇచ్చాక, తినే సమయంలో దానిని మనిషితో వాటిని ఏరి పక్కన పారేసేలా చేశాడు. అంటే ప్రయోజనం తీరాక విలువను కోల్పోయే పరిస్థితి అహంకారం వల్లే వస్తుందని ఇక్కడ గ్రహించాలి.

కరివేపాకు

ఇక అరటి ఆకు తన గొప్పతనాన్ని చాటుకుంటూ, మనుషులు పవిత్రంగా భోజనం చేయడానికి తననే వాడతారని, తాను అందరికంటే ఉన్నతురాలనని చెప్పిందట. దీంతో దేవుడు దాని విధిని కూడా మార్చాడు. అరటి ఆకులో భోజనం చేసిన తర్వాత దాని బ్రతుకు చెత్తకుప్పలో ముగిసేలా చేశాడు. అహంకారం ఉన్నచోట గౌరవం తాత్కాలికమే అని అరటి ఆకు ద్వారా తెలుస్తోంది.

అరటి ఆకు

తమలపాకు కూడా తన అందాన్ని, తాంబూలంగా తనకున్న ప్రాముఖ్యతను చూసి గర్వపడింట. తన వల్లనే నోరు ఎర్రగా పండుతుందని, తనకు సాటి ఎవరూ లేరని పొగరుగా మాట్లాడింది. అందుకే దేవుడు తమలపాకు అహంకారాన్ని కూడా అణచాడు. తమలపాకును నమిలి, ఆ రసాన్ని మింగి, మిగిలిన పిప్పిని బయటకు ఉమ్మేసేలా మనిషి ప్రవృత్తిని మార్చేసాడు.

 

తమలపాకు

కానీ వీటన్నిటికీ భిన్నంగా తులసి ఆకు మాత్రం చాలా వినయంగా ప్రవర్తించిందట. తాను కూడా పూజలో వాడబడతానని తెలిసినా, తన చివరి క్షణాలు దేవుని నిర్ణయమే అని, అంతా ఆయన దయ అంటూ నమ్రతతో పలికిందట. తులసి ఆకులోని ఈ వినయానికి భగవంతుడు ఎంతో సంతోషించి.. తులసికి అత్యున్నతమైన , పవిత్రమైన స్థానాన్ని ఇచ్చాడు.ఎలా అంటే దేవుని మెడలో హారంగా, స్వామి పాదాల చెంత తులసీదళంగా, భక్తులు సేవించే తీర్థంలో పరమ పవిత్రంగా ఉండేలా తులసిని దీవించాడు.

తులసి ఆకు

ఈ కథలోని పరమార్థం ఒక్కటే.. నేను, నా వల్లనే అనే అహంకారంతో ఉన్నవారు ఎలాంటివారైనా, ఎప్పటికైనా పతనం చెందుతారని అర్ధం చేసుకోవాలి. కానీ తులసిలా వినయంతో మసలుకునే వారు ఒక్కరే భగవంతుని సన్నిధిలో ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు. అందుకే జీవితంలో మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే అసలైన సంస్కారం.

Tata Harrier EV :టాటా హారియర్ EV- అదిరిపోయే ఫీచర్లు.. ఈ కారును కొనడం తెలివైన నిర్ణయమేనా?

 

Exit mobile version