Dum Biryani
ప్రపంచంలో ఎక్కడ బిర్యానీ గురించి మాట్లాడుకున్నా ముందుగా గుర్తొచ్చే పేరు హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, ఒక సంస్కృతికి నిదర్శనం. నవాబుల కాలం నుంచి వస్తున్న ఈ బిర్యానీ రుచికి దేశవిదేశాల్లో అభిమానులు ఉన్నారు.
హైదరాబాదీ బిర్యానీ(Dum Biryani)లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే అది చేసే విధానం. దీనిని ‘దమ్’ పద్ధతిలో వండుతారు. అంటే మాంసం , బియ్యాన్ని కలిపి ఒక పెద్ద పాత్రలో వేసి, దాని మూతను గోధుమ పిండితో సీల్ చేస్తారు. లోపల ఉండే ఆవిరి బయటకు పోకుండా తక్కువ మంట మీద గంటల తరబడి ఉడికిస్తారు.
దీనివల్ల మాంసానికి మసాలాలు బాగా పట్టి, అన్నం పొడిపొడిగా ఉడికి అద్భుతమైన వాసన వస్తుంది. ఈ బిర్యానీ తయారీలో వాడే సుగంధ ద్రవ్యాలు అంటే షాజీరా, యాలకులు, లవంగాలు , కుంకుమపువ్వు దీనికి ఆ రాజసం తీసుకువస్తాయి.
హైదరాబాదీ బిర్యానీ(Dum Biryani)లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి కచ్చీ బిర్యానీ, రెండోది పక్కీ బిర్యానీ. కచ్చీ బిర్యానీలో పచ్చి మాంసాన్ని మసాలాలతో నానబెట్టి, దాని మీద అర ఉడికిన బియ్యాన్ని వేసి దమ్ చేస్తారు. అసలైన హైదరాబాదీ రుచి అంటే ఇదే.
బిర్యానీతో పాటు ఇచ్చే మిర్చి కా సలాన్ , పెరుగు చట్నీ (రైతా) ఆ రుచిని ఇంకా పెంచుతాయి. హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో ఉండే పాత హోటళ్లలో తింటే ఆ రుచి మరెక్కడా దొరకదు. అక్కడ బిర్యానీ తింటున్నప్పుడు వచ్చే ఆ ఆరోమా మనిషిని మరో లోకానికి తీసుకెళ్తుంది.
కుంకుమపువ్వు కలిపిన పాలు అన్నం మీద చల్లడం వల్ల కొన్ని మెతుకులు తెల్లగా, మరికొన్ని పసుపు రంగులో కనిపిస్తూ కంటికి కూడా విందు చేస్తాయి.
పక్కీ బిర్యానీ (Pakki Biryani) స్టైల్ చాలా ప్రత్యేకం. ఇందులో మాంసం ,అన్నాన్ని విడివిడిగా పూర్తిగా వండి, ఆ తర్వాత లేయర్లుగా పేర్చి కాసేపు దమ్ చేస్తారు. ఇది చేయడం చాలా సులభం , రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
ఇందులో చికెన్ లేదా మటన్‌ను ముందే మసాలాలతో కలిపి గ్రేవీలా పూర్తిగా వండుతారు. బాస్మతీ బియ్యాన్ని కూడా 90% వరకు విడిగానే వండుతారు. దమ్ బిర్యానీ(Dum Biryani)లో మాంసం ఉడకదేమో అన్న భయం ఉంటుంది, కానీ పక్కీ బిర్యానీలో అన్నీ ముందే ఉడికిపోతాయి కాబట్టి టెన్షన్ ఉండదు.
చికెన్ లేదా మటన్‌కు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా మరియు పుదీనా కలిపి ఒక గంట పక్కన పెట్టాలి.ఒక బాణలిలో నూనె వేసి, ఈ మారినేట్ చేసిన మాంసాన్ని వేసి మెత్తగా ఉడికే వరకు వండాలి. గ్రేవీ మరీ చిక్కగా కాకుండా కొంచెం లూజ్‌గా ఉండాలి.మరో పక్క ఎసరు పెట్టి షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు వేసి బాస్మతీ బియ్యాన్ని 90% వరకు వండి వార్చుకోవాలి.
ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో సగం అన్నం వేసి, దాని పైన వండిన మాంసం గ్రేవీని పరవాలి. ఆ పైన మిగిలిన అన్నం వేయాలి.పైన కొద్దిగా నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు (Brown Onions), కొత్తిమీర చల్లాలి. మూత పెట్టి కేవలం 10 నిమిషాలు చిన్న మంటపై ఉంచితే, ఆ మసాలాలన్నీ అన్నానికి పట్టి పక్కీ బిర్యానీ రెడీ అయిపోతుంది. ముక్క మెత్తగా, అన్నం పొడిపొడిగా ఉండి తినడానికి చాలా బాగుంటుంది .
కేవలం మాంసాహారులకే కాదు, వెజిటేరియన్ బిర్యానీకి కూడా హైదరాబాద్‌లో మంచి క్రేజ్ ఉంది. హైదరాబాద్ వస్తే బిర్యానీ తినకుండా తిరిగి వెళ్లడం అంటే ఆ యాత్ర అసంపూర్తిగా ఉన్నట్లే.
