Zero waste kitchen
మన వంటిల్లు ఆరోగ్యానికి మూలం అని అంతా అనుకుంటారు. కానీ అది కాలుష్యానికి కూడా కేంద్రం అన్న విషయం చాలామంది గుర్తించలేకపోతున్నారు. ప్రతిరోజూ వంటింట్లో వచ్చే కూరగాయల తొక్కలు, మిగిలిన అన్నం, ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయి.
అందుకే జీరో వేస్ట్ కిచెన్ (Zero Waste Kitchen) అంటే.. వంటింట్లో నుంచి ఏ వస్తువు కూడా వృథాగా బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడటం అన్నమాట. ఇది కేవలం పర్యావరణానికే కాదు.. మన జేబుకు కూడా చాలా మేలు చేస్తుంది. తక్కువ వ్యర్థాలు అంటే తక్కువ కొనుగోళ్లు, ఎక్కువ పొదుపు అని అర్థం. చిన్న చిన్న మార్పులతో మన వంటగదిని పర్యావరణ హితంగా మార్చుకోవచ్చు.
మొదటగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. కూరగాయలు, కిరాణా సామాన్లు కొనడానికి వెళ్లినప్పుడు గుడ్డ సంచులు తీసుకెళ్లడం వల్ల ప్లాస్టిక్ కవర్ల వాడకం ఆగిపోతుంది. కూరగాయల తొక్కలు , మిగిలిన ఆహార పదార్థాలను పారేయకుండా వాటితో ఇంట్లోనే కంపోస్ట్ (ఎరువు) తయారు చేసుకోవాలి.
ఇది మన ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలకు అద్భుతమైన బలాన్ని ఇస్తుంది. ఎరువులు కొనాల్సిన అవసరం ఉండదు కాబట్టి డబ్బు ఆదా అవుతుంది. అలాగే వంట చేసేటప్పుడు తొక్కలను ఎక్కువగా పడేయకుండా, కొన్ని రకాల తొక్కలతో పచ్చళ్లు (ఉదాహరణకు బీరకాయ పొట్టు) చేసుకోవడం మన పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం. వస్తువులను కొనేటప్పుడు తక్కువ ప్యాకేజింగ్ ఉన్న వాటిని ఎంచుకోవడం మంచిది.
కిచెన్ లో వేస్ట్ ని తగ్గించాలంటే స్టోరేజ్ పద్ధతులను మార్చుకోవాలి. గాజు సీసాలు లేదా స్టీల్ డబ్బాలు వాడటం వల్ల వస్తువులు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. వంట చేసేటప్పుడు కుటుంబ సభ్యుల అవసరానికి తగ్గట్టుగానే వండాలి. దీనివల్ల అన్నం వృథా కాదు. ఒకవేళ మిగిలితే దానిని కొత్త రకమైన వంటకాలుగా (ఫ్రైడ్ రైస్ లేదా వడియాలు) మార్చుకోవచ్చు.
నీటి వాడకాన్ని కూడా పొదుపుగా చేయాలి. కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోయడం వల్ల నీరు ఆదా అవుతుంది. జీరో వేస్ట్ కిచెన్ అనేది ఒకే రోజులో సాధ్యం కాదు.. కానీ నిరంతరం ప్రయత్నిస్తే మన ఇల్లు ఒక పరిశుభ్రమైన , పొదుపైన గృహంగా మారే అవకాశం ఉంటుంది. ఇది మన పిల్లలకు మనం ఇచ్చే ఒక గొప్ప ఆదర్శం.
Harish Rao:హరీశ్ రావుకు సిట్ నోటీసులు..ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకున్నట్లేనా?
