Literature: చరమగీతం

Literature: చరమగీతం

Literature:

అతడు ఇక్కడే నడిచాడు
అతడు ఇక్కడే పరిగెత్తాడు
ఇప్పుడతని పాదాలు నేలను తాకలేవు…
వందల పాదాలు అతని కోసం
చివరి అడుగులు వేస్తున్నాయి!

అతడిక్కడే జ్ఞాపకాలు పోగేశాడు
అతడిక్కడే బంధాలను పెనవేశాడు
ఇప్పుడవన్నీ ఇక్కడే వదిలేశాడు.
ఇక్కడ నిలిచిన మనుషులు
అతని జ్ఞాపకాలను ఏరుకుంటున్నారు!

అతడిక్కడే ఆశలు నాటాడు
ఆశయాల రెక్కలతో పైకి ఎగిరాడు
ఇప్పుడతని చివరి గమ్యం చేరాడు..
ఆ ఆశలు ఊసులుగా మారిపోయి
కొన్ని రోజులు కబుర్లు చెప్పుకుంటాయి!

అతడిక్కడే ప్రేమలు కురిపించాడు
అతడిక్కడే ద్వేషం రగిలించాడు
ఇప్పుడన్నిటికీ అతీతుడయ్యాడు..
ఇప్పుడతని అడుగు జాడలు
శిధిలమవ్వడానికి సిద్ధమవుతున్నాయి!

అతడి జీవితాన్ని ఎప్పుడూ జీవించలేదు
కాలాన్ని కాగితపునోట్లగా మార్చుతూ
దేహాన్ని దీపపు ఒత్తిలా కరిగించి
సంతోషాలను సుదీరతీరాలలోకి నెట్టాడు
ఇప్పుడతడు శూన్యమైపోయాడు

కాల ప్రవాహంలో బిందువయ్యాడు
శుష్క భూమిలో రేణువయ్యాడు
అతడి కోసం ఏ ఒక్కటి ఆగిపోలేదు
అతడెవరో?
ఎక్కడున్నాడో?
లేక మనలోనే దాక్కున్నాడో..!

–ఫణి మండల
8555988435

Exit mobile version