Literature
తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?
మన మాతృభాషేమో
మృతభాష అవుతుంటే
మన అమ్మ భాషేమో
అంపశయ్య మీదుంటే..
ఊపిరెయ్యాల్సిన చోట
ఉరికొయ్యలెక్కిస్తే
ఉరకలెత్తాల్సిన చోట
ఉపేక్ష చూపిస్తే..
తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?
పాఠశాలలో లేదు
పాఠాలలో లేదు
పలకరింపులలో లేదు
ప్రియమైన మన తెలుగు…
ఆంగ్ల మాధ్యమ విద్య
తెలుగు మాధ్యమమే మిథ్య
ఇంత నిర్లక్ష్యం మద్య
ఎపుడెలుగు మన తెలుగు..
తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?
మేధావి వర్గాలు
మొత్తుకున్నా గాని
భాషాభిమానులు
బాధపడినా గాని
ఆంధ్ర జాతి మీద
ఆంగ్ల మోజు రుద్ది
ఉద్యోగ వేటలో
వెనకబడతావంటూ..
కల్ల మాటలకు నేడు
తెల్లబోయెనే తెలుగు…
తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?
కృష్ణ దేవ రాయులు
కొనియాడిన తెలుగు
అష్టదిగ్గజ కవుల
కావ్యాల వెలుగు…
అన్నమాచార్యుని సంకీర్తనై
శ్రీరామదాసుని ఆరాధనై
పోతనామాత్యుని పద్యమై
యోగి వేమనుని తత్వమై
వెలిగింది చరితలో
వెల కట్టలేని తెలుగు..
వెలివేయబడె నేడు
వెలితి కాదా చూడు…
తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?
గ్రామీణ యాసకు
ఊతమిచ్చిన గిడుగు
సమాజ శ్రేయస్సుకు
గురజాడ అడుగు…
ఆంధ్రమునే వెలిగించు
కవీంద్రులెందరో…
తెలుగు సాహితీ వనమున
ప్రక్రియలెన్నెనో…
ఏ భాషలో లేదు
ఇంత మధురము
మనమేల మన భాష
మరిచిపోయెదము…
తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?
లోకమంతా చూడు
మాతృభాషనే పొగుడు..
అభ్యసించుటకెన్నడు
అడ్డు కానేకాదు
జ్ఞానమన్నదెపుడు
భాష వలన రాదు…
భాష జాలము వీడి
భావజాలం పట్టు
మునుముందు తరాలు
తెలుగు నేర్చేటట్టు..
తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?
తెలుగు భాష లేకుంటే
తెలుగు జాతి ఎక్కడ…
రెండొందలేళ్లేలిన
ఆంగ్లేయులే
మన భాషనేనాడు
అణిచేయలే..
నేడేమో మననేలు
నాయకులే
తెలుగుకే తెరలేసే
ప్రయత్నాలు లే..
తెలుగోడా.. మన గోడు
వినేది ఎవడు..?
తెలుగోడా..మన గళం
వినిపించాలి నేడు
తెలుగోడా..ప్రతి పనిని
తెనుగించి చూడు..
మన భాష మన యాస
మన శ్వాస రా…
మన భాష మన కలం
మన బలం రా..
తెలుగోడా..మన గళం
వినిపించాలి నేడు..
– ఫణి మండల