Literature
ఆకలి మస్తిష్కందైతే ..
కుక్షి నిండి ఆగగలడా..?
జగతి అంతా వెతికి చూస్తే
మనిషి కన్నా మించినంశం
లేదు ఎక్కడ..
మనిషికెన్ని వేషాలో
అతని తీరుకెన్ని కోణాలో..
వనం నుంచి వేరు చేసే
అమితమైన తెలివి నాడు,
వికృతంగా వేయి తలలై
విషపు బీజాలు మొలచె నేడు…
సృజన శీలై ,సృష్టికర్తై
అడుగడుగు ఎదిగినాడు
స్వార్థపరతను నీరు పోసి
ఆసాంతం పెంచినాడు…
రెండు వైపులా పదును ఉన్న
జ్ఞానమనెడి కత్తి తోటి
వికాసమనే వేషమేసి
ధ్వంస రచన చేసినాడు…
అహంకారం అగ్నిలాగా
ఆత్మనందు రగులుతుంటే
మతమనెడి ముసుగు వేసి
విషమెంతో కక్కినాడు…
కులం గోడ, భాష గోడ
గోడలెన్నో కట్టుకుంటూ
తనకు తాను రక్షణంటూ
ఆయుధాలు పట్టినాడు..
చావు మీద గెలుపు కోసం
పరిశోధనలెన్నో చేసినాడు
మరణమునే గెలిచినోడు
ఒక్కడైనా కానరాడు…
అయినా ఆశ మనిషి తీరు
ఆగదు ఆదిపత్య పోరు
ఆకలి మస్తిష్కందైతే
కుక్షి నిండి ఆగగలడా…
వందలాది దేవుళ్లను
లోకమంతా నిలిపాడు
భక్తి అనే విత్తు వేసి
మాయలోన మునిగాడు..
స్వర్గం, నరకం సృష్టించి
మంచి,చెడులు చెప్పాడు
శాంతి కపోతాలెగరేస్తూ
రణ నాదం ఊదాడు…
గగనమంతా వెతుక్కుంటూ
విశ్వ వేదికెక్కాడు
పక్కవాడిని తొక్కుకుంటూ
విజయమనుకున్నాడు…
అడవి గుండె చీల్చుతూ
అవనిని గెలిచామంటూ
అంతులేని కాలుష్యం
లోకమంతా పరిచినాడు…
కన్నీటి నది పారుతుంటే
కరుణ సాగరమెండుతుంది
కాఠిన్యం మనసు చుట్టూ
కాపలాగా పెట్టాడు…
సంపదలివ్వని సాగు కన్నా
సాంకేతికత మిన్నంటే
కృత్రిమైన మేధతో
క్షుద్బాధనెలా తీర్చగలడు..
గెలిచినోడు,ధనవంతుడు
అక్కడితో ఆగిపోడు
ఓడినోడు,పేదవాడు
అడుగైనా కదలలేడు…
కోట్ల మంది మనుషులు
భూగోళం చుట్టూరా
కోట్ల కొద్దీ ఆశా జ్వాలల
రగిలే తపన ఆగేదేనాడు..?
…..ఫణి మండల