Literature : యుద్ధం మాటున..

Literature : దేశాల సరిహద్దుల పోరులో దేహాలు చిద్రమవుతుంటే శాంతి సిద్ధాంతాలు పుస్తకాలు దాటలేదు ..

Literature

ఈ ప్రపంచమేమంత
అభివృధ్ధి చెందలేదు..
అనాగరికమైన ఆధిపత్య పోరు
ఇంకా అంతమవ్వలేదు…

అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహాలు
ఆకాశాన్ని తాకే హర్మ్యాలు
అణు‌బాంబుల నిల్వలు
అతి వేగపు రైలులు
ఇవేనా అభివృద్ధి చిహ్నాలు?
ఇవేనా నాగరిక ఆనవాలు?

గాజాలో బిడ్డల ఆకలి కేకలు
ఈ ప్రపంచపు యుద్ధోన్మాదాన్ని
వదిలించలేకుంది…
కలలను పండించాల్సిన చిట్టిచేతులు
రొట్టెలకై చేయి చాస్తుంటే
శిబిరం సాయం కోసం
శూన్యంలోకి చూస్తుంది..

యుద్ధం..
ఇక్కడ రెండు రకాలు
బాహ్యంగా బాంబుల దాడులు
అంతరంగా ఆకలి హింస..
రెండూ చంపేస్తున్నా
మానవత్వం సంక్షోభంతో
కొట్టుమిట్టాడుతుంది..

నిలిచే నేల వణుకుతుంది
పీల్చే గాలి ధూళయ్యింది
ఉండే ఆవాసం ఒరిగిపోయింది
చదివే పాఠశాల మూసుకుంది
ప్రాణం విలువ లెక్క తప్పింది
కరువు కోరలు తెరుచుకుంది

దేశాల సరిహద్దుల పోరులో
దేహాలు చిద్రమవుతుంటే
శాంతి సిద్ధాంతాలు
పుస్తకాలు దాటలేదు ..
శాంతి సమావేశాలు
గది తలుపులు తెరవలేదు..

ఆకలి‌ కంటే ద్వేషం గొప్పదైనప్పుడు
సంపద సృజన కంటే నాశనం వైపే
తరలిపోతుంది..
కరెన్సీ విలువతో పాటు
మానవత్వం విలువ
దిగజారిపోతుంది..

అభివృద్ధి అంటే అణుశక్తి కాదు
అణువణువున ప్రేమ కావాలి
ప్రగతి సాంకేతికంగానే చాలదు
ప్రజలు సామాజికంగానూ మెరుగవ్వాలి
అందుకే అంటున్నా
ఈ ప్రపంచమేమంత
అభివృధ్ధి చెందలేదు..

ఒక ఉనికి కోసం, ఒక గోడ కోసం
ఏమిటి ఈ అంతులేని తర్పణ?
మనిషి కన్నీటి విలువ కన్నా
అధికమా మట్టికి గీసిన గీత?
అందుకే అంటున్నా
ఈ ప్రపంచమేమంత
అభివృధ్ధి చెందలేదు..
ఎందుకంటే మనిషి
ఇంకా మనిషిని చంపుతున్నాడు..

— ఫణి మండల

 

Exit mobile version