Rocket
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) సామర్థ్యం ఇప్పుడు అంచనాలకు మించి పెరిగింది. ఒకప్పుడు సైకిల్‌పై రాకెట్(Rocket)ను తీసుకెళ్లి ప్రయోగాలు చేసే స్థాయి నుంచి, ఇప్పుడు ప్రపంచ దేశాల అత్యంత భారీ ఉపగ్రహాలను నింగిలోకి చేర్చే స్థాయికి ఇస్రో ఎదిగింది. గతంలో రష్యా, చైనా, అమెరికా వంటి దేశాలు మనల్ని అవహేళన చేసినా, ఇప్పుడు అదే అమెరికాకు చెందిన కీలక ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించే స్థాయికి చేరుకుంది.
మరో నాలుగైదు రోజుల్లో శ్రీహరికోట నుంచి LVM-03 M6 అనే రాకెట్(Rocket) ద్వారా అమెరికాకు చెందిన 6.5 టన్నుల బ్లూబర్డ్-6 (BlueBird-6) ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. భారత్–అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ఈ మెగా ప్రయోగం ఇస్రో సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పనుంది.
ఇస్రో రాకెట్(Rocket) సామర్థ్యం పెరిగిన వైనం..ఐదేళ్ల క్రితం వరకు ఇస్రోకు కేవలం రెండు టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి ప్రవేశ పెట్టగలిగే సామర్థ్యం ఉండేది. అంతకంటే బరువైన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలంటే ఫ్రెంచ్ గయానా, రష్యా లాంటి విదేశీ అంతరిక్ష సంస్థల సహాయం తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఇస్రో ఆ పరిస్థితిని పూర్తిగా అధిగమించింది.
LVM – 03 అనే సరికొత్త వాహక నౌకను తయారు చేసి, అది 4 టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాలను సైతం నింగిలోకి తీసుకెళ్లే సామర్థ్యాన్ని చూపించింది. ఈ రాకెట్‌ను అప్పట్లో ‘బాహుబలి’ రాకెట్‌గా పిలిచేవారు. ఇప్పుడు ఆ రాకెట్ మరింత అప్‌గ్రేడ్ అయి, బాహుబలి 2 లాగా తయారైంది. ఇప్పుడు ఇది ఏకంగా 6.5 టన్నుల బరువున్న అమెరికా బ్లూ బర్డ్-6 ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ఈ నెల 15 నుంచి 20 లోపు జరగనుంది.
బ్లూబర్డ్-6 ప్రత్యేకతలు..టెక్సాస్ కేంద్రంగా పనిచేసే A స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన ఈ బ్లూబర్డ్-6 ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా నేరుగా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను మెరుగ్గా అందిస్తుంది. ఈ శాటిలైట్ హై బ్యాండ్‌విడ్త్ నెట్‌వర్క్‌ను అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఇతర ఉపగ్రహాల కంటే మూడున్నర రెట్లు పెద్దదిగా, సుమారు పది రెట్లు అధిక డేటా సామర్థ్యంతో పనిచేయనుంది.
అక్టోబరు 19న అమెరికా నుంచి శ్రీహరికోటకు చేరిన ఈ ఉపగ్రహానికి సంబంధించిన ఇంధన నింపుదల, తుది తనిఖీలను శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. భవిష్యత్తులో వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే గగన్యాన్ ప్రాజెక్టుకు కూడా ఇదే LVM-03 రాకెట్‌ను ఉపయోగించనున్నారు.
