Ban on books
2025 ఆగస్టు 5న, జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో 25 పుస్తకాలపై నిషేధం (Ban on books)విధించబడింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాలతో హోం శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వం ప్రకారం, ఈ పుస్తకాలు తప్పుడు కథనం, విభజనవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, యువతను రాడికలైజ్ చేసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నాయని పేర్కొంది. కానీ, రచయితలు, మేధావుల నుంచి దీనిపై బలమైన ప్రతిఘటన వ్యక్తమవుతోంది. ఈ నిషేధం అనేది కేవలం అక్షరాలపై కాదని, చరిత్ర, స్వేచ్ఛాయుత ఆలోచనలపైనా జరిగిన దాడిగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిషేధిత జాబితాలో దేశ, విదేశీ చరిత్రకారులు, ప్రముఖ రచయితల పుస్తకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైనవి ..హఫ్సా కాంజ్వాల్ రచించిన -Colonizing Kashmir అరుంధతి రాయ్ -Azadi, అనురాధా భాసిన్ -A Dismantled State, ఏ.జీ. నూరానీ -The Kashmir Dispute, క్రిస్టోఫర్ స్నెడన్ -Independent Kashmir, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వంటి ప్రచురణ సంస్థలు కూడా ఈ పుస్తకాలను ప్రచురించాయి.
ఈ నిషేధానికి (Ban on books)ప్రభుత్వం చెప్పిన కారణాలు.. కశ్మీర్ గురించి తప్పుడు చరిత్రను ప్రచారం చేయడం.ఉగ్రవాదాన్ని సమర్థించే కథనాలను వ్యాప్తి చేయడం, భద్రతా దళాలను అపహాస్యం చేయడం, యువతను రెచ్చగొట్టడం.
ఈ ఆదేశాల తర్వాత, శ్రీనగర్, ఇతర ప్రాంతాల్లోని బుక్‌షాపులపైనా పోలీసులు దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈ సంవత్సరం మొదట్లో కూడా ..నిషేధిత సంస్థల భావజాలాన్ని ప్రోత్సహిస్తున్న 668 పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై రచయితలు, రాజకీయ, మత నేతలు తీవ్రంగా స్పందించారు. శ్రీనగర్ మౌలవి ఒమర్ ఫారూక్ మాట్లాడుతూ, “వాస్తవాలు పుస్తకాల ద్వారా బయటికి వస్తాయి, వాటిని నిషేధించడం వల్ల ప్రజలు తమ చరిత్రను, జ్ఞాపకాలను మర్చిపోరు” అన్నారు.
‘Colonizing Kashmir’ రచయిత హఫ్సా కాంజ్వాల్ ఈ నిషేధం తన రాతను మరింత పదును పెట్టేందుకు ప్రోత్సాహమని పేర్కొన్నారు. “సెన్సార్‌షిప్ ప్రయత్నం మా రచనలో బలం ఉందని చెప్పడానికి సంకేతం” అని ఆమె అన్నారు.
‘A Dismantled State’ రచయిత అనురాధా భాసిన్ ఈ చర్యను ఊహించదగ్గదేనని, అయితే ఇది కశ్మీర్ గురించి స్వేచ్ఛగా మాట్లాడే స్వతంత్ర గొంతులను అడ్డుకునే ప్రయత్నమని వ్యాఖ్యానించారు. తన పుస్తకం వాస్తవాలు, లోతైన పరిశోధనతో రాసిందని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం అనేది కేవలం ఆరోపణ మాత్రమేనని ఆమె అన్నారు.
రాజకీయ శాస్త్రవేత్త సుమంత్ర బోస్ ఈ నిషేధాన్ని నిష్ఫలమైన నిషేధంగా అభివర్ణించారు. డిజిటల్ యుగంలో ఇటువంటివి ఎలా పనిచేస్తాయో ఎవరికీ తెలియదని, కానీ ప్రపంచ దృష్టిలో మాత్రం ఈ చర్యలు నిషేధించబడుతున్న విషయాన్ని మరింత ప్రసిద్ధి చేస్తాయని ఆయన అన్నారు.
ఈ నిషేధంలో ‘తిరస్కరణ’, ‘అమానుషత్వం’, ‘స్వేచ్ఛ లోపం’ వంటి పదాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. రచన, జ్ఞానం, ఆలోచనల ప్రవాహాన్ని ఎప్పటికీ అణచివేయలేరని రచయితల ఆత్మవిశ్వాసం ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తోంది.