HCA
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) యువ క్రికెటర్ల జీవితాలతో ఆడుకుంటోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) సెక్రటరీ ధరం గురువారెడ్డి మండిపడ్డారు. మంత్రి వివేక్ కు హెచ్ సీఏతో ఏం పని ఉందని ప్రశ్నించారు. మంత్రిగా ఉంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
బీసీసీఐ గుర్తింపు లేకుండా కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారన్నారు. దీనిలో ఆడిన క్రికెటర్లపై చర్యలు తీసుకునే అధికారం బీసీసీఐకి ఉంటుందన్నారు. వివేక్ తన తండ్రి పేరిట టోర్నీ నిర్వహించుకోవచ్చని, కానీ దానిలో హెచ్ సీఏను భాగస్వామ్యం చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. సీఎం, మంత్రుల ఫోటోలు వేసుకుని టోర్నీ నిర్వహించారని, హెచ్ సీఏ సభ్యులతో ములాఖత్ అయ్యి నిధులు స్వాహా చేసేందుకు ప్లాన్ చేసారన్నారు.
2018లోనే టీ20 లీగ్స్ నిర్వహించే అధికారం లేదని బీసీసీఐ స్పష్టంగా చెప్పినా హెచ్ సీఏ పట్టించుకోవడం లేదన్నారు. హెచ్ సీఏకు సుప్రీం కోర్టు ఆదేశాలంటే లెక్క లేదని, బీసీసీఐ రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ జిల్లాల్లో తమకు పట్టులేదని గతంలోనే హెచ్ సీఏ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ కు హెచ్ సీఏ ఏం చేసిందని ప్రశ్నించారు. తాము పదేళ్ళుగా సొంత డబ్బులతో టీసీఏ తరపున క్రికెట్ టోర్నీలు నిర్వహిస్తున్నామని, ఎంతో మంది యువ ఆటగాళ్ల టాలెంట్ ను గుర్తించామన్నారు.
మరి బీసీసీఐ నుంచి కోట్లాది రూపాయలు నిధులు పొందుతున్న హెచ్ సీఏ గ్రామీణ ప్రాంతాల్లో కనీసం సెలక్షన్స్ కూడా నిర్వహించడం లేదని గుర్తు చేశారు. కేవలం హైదరాబాద్ లో తెలంగాణ జిల్లాల నుంచి ఆటగాళ్లను రప్పించి సరైన ఏర్పాట్లు చేయకుండా సెలక్షన్స్ నిర్వహించారని, అవి కూడా పారదర్శకంగా జరగలేదన్నారు.
కనీసం జిల్లాల్లో గ్రౌండ్స్ కూడా లేవన్నారు. ప్రస్తుతం అపెక్స్ కౌన్సిల్ లో ఉన్న సభ్యులందరూ ఆ పదవుల్లో ఉండేందుకు అనర్హులన్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న వారిపై బీసీసీఐకి ఫిర్యాదు చేసామన్నారు. ఇప్పుడు ఇదే అపెక్స్ కౌన్సిల్ తెలంగాణ టీ20 లీగ్ ను ప్రకటించడం దారుణమన్నారు. దీనిపైనా బీసీసీఐకి ఫిర్యాదు చేసమన్నారు. ఇక గత కొన్నేళ్లుగా హెచ్ సీఏపై ఉన్న అవినీతి కేసుల్లో విచారణను త్వరగా పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం హెచ్ సీఏను పర్యవేక్షిస్తున్న రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ నవీన్ రావు ఈ మొత్తం వ్యవహారాలపై దృష్టి సారించాలని కోరారు.
Assembly : అసెంబ్లీలో నో వర్క్ – నో పే.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన ప్రతిపాదన అమలు సాధ్యమేనా?
