Right of way
రోడ్డు ప్రమాదాల నివారణలో అత్యంత ముఖ్యమైన నియమం, కానీ చాలా మంది ఉల్లంఘించే అంశం ‘రైట్ ఆఫ్ వే’ (Right of Way). ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి కారణాలతో పాటు, సిగ్నళ్లు లేని జంక్షన్ల వద్ద, యూటర్న్‌ల వద్ద ఈ రైట్ ఆఫ్ వే ని ఉల్లంఘించడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
చట్టబద్ధంగా ఏ వాహనదారుడికైతే లేదా పాదచారికైతే ముందు వెళ్లడానికి తొలి హక్కు (First Right to Proceed) కల్పించబడుతుందో, దానినే రైట్ ఆఫ్ వే అని అంటారు. సరళంగా చెప్పాలంటే, ట్రాఫిక్‌లో మొదట ఎవరు కదలాలి, ఎవరు వేచి ఉండాలి అనే ప్రాధాన్యతను ఇది నిర్ణయిస్తుంది. ఈ నియమాన్ని పాటించడం వల్ల రోడ్లపై గందరగోళం తగ్గి, ప్రమాదాలు నివారించబడతాయి.
రైట్ ఆఫ్ వే హక్కు వివిధ రకాల రోడ్డు పరిస్థితులలో భిన్నంగా వర్తిస్తుంది. కొన్ని ముఖ్యమైన సందర్భాలను పరిశీలిస్తే..
యూటర్న్ తీసుకునేటప్పుడు.. మీరు యూటర్న్ తీసుకుంటున్నట్లయితే, ఎదురుగా (Opposite Direction) వస్తున్న వాహనానికే రైట్ ఆఫ్ వే ఉంటుంది. ఆ వాహనం సురక్షితంగా వెళ్లిపోయిన తర్వాతే, మీరు యూటర్న్ తీసుకోవాలి.
రౌండ్‌బౌట్‌లు (Roundabouts) వద్ద.. జంక్షన్‌ల వద్ద ఉండే రౌండ్‌బౌట్‌లో లోపల తిరుగుతున్న వాహనాలకే (Vehicles Already in the Circle) రైట్ ఆఫ్ వే హక్కు ఉంటుంది. బయట నుంచి వచ్చే వాహనాలు, లోపలి వాహనాలు వెళ్లాకే ప్రవేశించాలి.
సింగిల్ రోడ్డుపై ఓవర్ టేక్ (Overtake): సింగిల్ లేన్ రోడ్డుపై మీరు ఒక వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్నప్పుడు, ఎదురుగా వస్తున్న వాహనానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ వాహనం వెళ్లిపోయే వరకు మీరు వేచి ఉండి, సురక్షితంగా ఉన్నప్పుడే ఓవర్ టేక్ పూర్తి చేయాలి.
జీబ్రా క్రాసింగ్‌ల వద్ద (Zebra Crossing).. జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతున్న పాదచారులకే (Pedestrians) రైట్ ఆఫ్ వే ఉంటుంది. వారు రోడ్డు దాటినాకే మిగతా వాహనాలు కదలాలి. ఇది అత్యంత కఠినంగా పాటించాల్సిన నియమం.
గల్లీల నుంచి మెయిన్ రోడ్డుపైకి.. మీరు ఏదైనా చిన్న వీధి (లేదా గల్లీ) నుంచి ప్రధాన రహదారి (Main Road)పైకి వస్తున్నప్పుడు, ప్రధాన రోడ్డుపై వెళ్తున్న వాహనాలకే రైట్ ఆఫ్ వే ఉంటుంది. ఆ వాహనాలు సురక్షితంగా వెళ్లిపోయాకే మీరు మెయిన్ రోడ్డుపైకి ప్రవేశించాలి.
అత్యవసర వాహనాలకు ఎప్పుడూ రైట్ ఆఫ్ వే(Right of way)..ముఖ్యంగా, కొన్ని రకాల వాహనాలకు ట్రాఫిక్, నిబంధనలతో సంబంధం లేకుండా ఎప్పుడూ తొలి ప్రాధాన్యత ఉంటుంది. అవే అత్యవసర వాహనాలు. ఉదాహరణకు, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్, పోలీస్ వ్యాన్ వంటి వాహనాలు సైరన్‌తో వస్తున్నప్పుడు, వాటికి ఎవరైనా, ఎక్కడైనా వెంటనే దారి ఇవ్వాల్సిందే. ఇది కేవలం నియమం మాత్రమే కాదు, మానవత్వాన్ని చాటుకునే అత్యవసర బాధ్యత కూడా.
రైట్ ఆఫ్ వే(Right of way) నిబంధనను పాటించడం అనేది కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదు. మనతో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న మిగతా వారి ప్రాణాలను గౌరవించడం, మన సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించుకోవడం.
