Ind Vs Eng: గెలిస్తేనే నిలుస్తారు.. ఇంగ్లాండ్ తో భారత్ డూ ఆర్ డై
Ind Vs Eng: ఇండోర్ వేదికగా జరిగే ఈ చావోరేవో మ్యాచ్ లో భారత జట్టు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఉండాలంటే ఇంగ్లాండ్ ను ఓడించాలి.

Ind Vs Eng
మహిళల ప్రపంచకప్ లో భారత జట్టు(Ind Vs Eng) డూ ఆర్ డై మ్యాచ్ కు రెడీ అయింది. మెగాటోర్నీలో ఈ సారి ఛాంపియన్ గా నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్ అండ్ కో దానికి తగ్గట్టే వరుసగా రెండు మ్యాచ్ లలో గెలిచింది. కానీ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఫలితంగా సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లపై గెలిచే మ్యాచ్ లు చేజేతులా జారవిడుచుకోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆ ఓటముల నుంచి బయటపడిన భారత్ ఇప్పుడు ఇంగ్లాండ్(Ind Vs Eng) తో కీలకపోరుకు రెడీ అయింది.
ఇండోర్ వేదికగా జరిగే ఈ చావోరేవో మ్యాచ్ లో భారత జట్టు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా ఉండాలంటే ఇంగ్లాండ్ ను ఓడించాలి. ఒకవేళ ఇంగ్లీష్ టీమ్ చేతిలో ఓడితే మాత్రం సెమీస్ అవకాశాలు చాలా వరకూ దూరమవుతాయి. ప్రధానంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పేలవ పామ్ ఇబ్బందిగా మారింది. భారీ అంచనాలు పెట్టుకున్న హర్మన్ స్థాయికి తగినట్టు ఆడలేకపోతోంది.

ఆమె వైఫల్యం మిడిలార్డర్ పై ఒత్తిడి పెంచుతోంది. ఫలితంగా జట్టు భారీస్కోర్లు చేస్తుందనుకుంటే తక్కువ స్కోర్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి. అయితే ఆరంభ మ్యాచ్ లలో విఫలమైన స్మృతి మంధాన ఆసీస్ పై ఫామ్ అందుకోవడం జట్టుకు అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. హర్మన్ తో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా రాణిస్తే మంచి స్కోర్ సాధించే అవకాశముంటుంది.
అయితే హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీపైనా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్ తో పాటు బౌలర్ల మార్పుల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించలేకపోతోంది. ఇవి అధిమించకుంటే మాత్రం ఇంగ్లాండ్ పై ఇబ్బందులు తప్పవు. ఇదిలా ఉంటే బౌలింగ్ కాంబినేషన్ లో ఖచ్చితంగా మార్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మిగిలిన జట్లతో పోలిస్తే ఆరో బౌలర్ లేకపోవడం ఇబ్బందిగా మారింది.

దీంతో మిగిలిన మ్యాచ్ లకు ఆల్ రౌండర్ రాధా యాదవ్ ను జట్టులోకి తీసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే డెత్ ఓవర్లలో మన బౌలింగ్ చాలా చెత్తగా ఉంటోంది. గత రెండు మ్యాచ్ లలో ఓటమికి కారణంగా డెత్ ఓవర్లే. గెలుపు ఖాయమనుకున్న సమయంలో చివరి ఓవర్లలో మన బౌలర్లు తేలిపోతున్నారు. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.
ఇది కూడా మెరుగుపరుచుకోకుంటే మాత్రం ఇబ్బందే. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్(Ind Vs Eng) ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. భారత్ పై గెలిస్తే ఆ జట్టుకు సెమీస్ బెర్త్ దాదాపుగా ఖాయమవుతుంది. అయితే గత మ్యాచ్ పాక్ పై ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. వర్షం రాకుంటే పాక్ చేతిలో ఓడిపోయేది. అయినప్పటకీ ఇంగ్లాండ్ ను తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. మొత్తం మీద ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో గెలిచి సెమీస్ రేసులో నిలవాలని భారత మహిళల జట్టు పట్టుదలగా ఉంది.