Gauri Lankesh: గౌరమ్మ..నిన్నెందుకు చంపారమ్మా?..కాలం చెరపలేని స్ఫూర్తి గౌరీ లంకేశ్

Gauri Lankesh: 2017లో గౌరీ లంకేశ్‌ను బెంగళూరులోని ఆమె ఇంటి బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

Gauri Lankesh

2017లో సెప్టెంబర్ 5 సాయంత్రం, సమాజంలో పేరుకుపోయిన అన్యాయాలపై తన కలంతో అక్షరాలను అస్త్రాలుగా సంధించిన ఒక ధైర్యశాలి.. దారుణంగా హత్యకు గురయ్యారు. ఆమే గౌరీ లంకేశ్(Gauri Lankesh). ఆ పదునైన కలం ఆగిపోయి నేటికి ఎనిమిదేళ్లు.

గౌరీ లంకేశ్ (Gauri Lankesh)స్త్రీ-పురుష సమానత్వంపై ఆమెకున్న నిక్కచ్చి అభిప్రాయాలను నిర్భయంగా పంచుకున్నారు. ఆమె మాటల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే ..చిన్ననాటి నుంచే అసమానతలను నేర్పించే మన పాఠ్యపుస్తకాలపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వందలాది వృత్తుల గురించి పరిచయం చేసేటప్పుడు కేవలం పురుషుల బొమ్మలు మాత్రమే కనిపించడం, స్త్రీల కోసం హౌస్ వైఫ్ అనే పదాన్ని మాత్రమే కేటాయించడంపై ఆమె ప్రశ్నించారు. ఇంట్లో పనిచేసే పురుషులు, ఆఫీసుల్లో పనిచేసే స్త్రీలు ఎంతో మంది ఉన్నప్పుడు పాఠ్యపుస్తకాలు ఇలాంటి తప్పుడు సందేశాలు ఎందుకు ఇస్తున్నాయని ఆమె నిలదీశారు.

Gauri Lankesh

ఆమె వివాహం, విడాకులు, వ్యక్తిగత జీవితంపై జరిగిన విమర్శలకు కూడా ధైర్యంగా సమాధానమిచ్చారు. తన భర్తతో.. భర్తగా కంటే స్నేహితులుగా తాము మెరుగ్గా ఉండగలమని గ్రహించి విడాకులు తీసుకున్నామని, అయినా తమ మధ్య మంచి స్నేహ సంబంధాలు కొనసాగాయని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితంపై వచ్చిన విమర్శలను తాను పట్టించుకోనని, వాటిలో నిజం ఉంటేనే తాను చర్చకు సిద్ధపడతానని చెప్పి, తన వ్యక్తిత్వానికి అద్దం పట్టారు.

స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో ఆమె బలంగా నమ్మారు. తన తల్లి పెళ్లి కంటే చదువుకు, ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని, భర్త మీద ఆధారపడే జీవితాన్ని ఆమె పూర్తిగా వ్యతిరేకించారని గుర్తు చేసుకునేవారు. ఈ సూత్రాన్నే ఆమె ఇతర ఆడపిల్లలకు కూడా బోధించారు.

ఆమె తండ్రి లంకేశ్ మరణం తర్వాత “లంకేశ్ పత్రికే”ను నడిపేంత శక్తి ఆమెకు ఉందా అని చాలామంది సందేహించారు. అయినా, ఆమె పట్టుదలతో మూడు నెలల పాటు ఆ పత్రికను నడిపి, తర్వాత పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడంతో కన్నడ రాయడం ఇబ్బంది అయినా కూడా, పట్టుదలతో కన్నడలోనే సంపాదకీయాలు రాశారు. ఆమె ఇంగ్లీష్‌లో రాస్తే మరొకరు అనువాదం చేస్తున్నారని వచ్చిన పుకార్లను కూడా ఆమె ధైర్యంగా తిప్పికొట్టారు.

తండ్రి లంకేశ్‌తో తన అనుబంధం గురించి ఆమె చాలా అద్భుతంగా వివరించారు. ఆయన ఒక పెద్ద మర్రిచెట్టులాగా, ఆయన నీడలో మరే చెట్టూ ఎదగలేదని, అలాగే ఆయన ఒక ఏనుగు నడిచిన దారిలాగా, ఆ దారిలో వెళ్లడం ఇతరులకు సులువు అని చెప్పారు. తండ్రితో ఉన్న లోతైన అనుబంధాన్ని ఆమె ఈ మాటల్లో చూపించారు.

Gauri Lankesh

గౌరీ లంకేశ్ హత్యకు ప్రధాన కారణం ఆమె తన పత్రికలో రాసిన కథనాలే. ఆమె తన లంకేశ్ పత్రికేలో హిందుత్వ రాజకీయాలు, కుల వ్యవస్థ, మతతత్వం, సమాజంలో ఉన్న అసమానతలపై నిష్పక్షపాతంగా, నిర్భయంగా రాసేవారు. ఈ అంశాలపై ఆమె చేసిన విమర్శలు కొన్ని హిందూ అతివాద సంస్థలకు, వ్యక్తులకు నచ్చలేదు. ఈ కారణాల వల్ల ఆమె తరచూ బెదిరింపులను ఎదుర్కొన్నారు.

2017లో గౌరీ లంకేశ్‌ను బెంగళూరులోని ఆమె ఇంటి బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ కేసు విచారణలో, ఒక హిందూ అతివాద గ్రూప్ ఈ హత్యకు పాల్పడిందని పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో కొంతమంది ఇతర హత్య కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అమోల్ కాలే అని పోలీసులు చెప్పారు.

విచారణ ప్రకారం, నిందితులు గౌరీ లంకేశ్‌ను చంపడానికి ఒక సంవత్సరం ముందు నుంచే ప్లాన్ చేశారు. ఆమెను కొన్ని రోజులు ఫాలో చేసి, ఆమె కదలికలను గమనించారు. ఆ తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపి, హత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది.

మొత్తంగా గౌరీ లంకేశ్ కేవలం ఒక జర్నలిస్ట్ మాత్రమే కాదు, ఒక స్వతంత్ర భావాలు కలిగిన స్త్రీ, సమానత్వం కోసం పోరాడిన యోధురాలు. ఆమె వ్యక్తిత్వం, ఆలోచనలు, ధైర్యం మనందరికీ ఒక స్ఫూర్తి. తన రచనల ద్వారా ఆమె ఎత్తి చూపిన అసమానతలు, అన్యాయాలు ఇప్పటికీ మన సమాజంలో ఉన్నాయని గమనించినప్పుడు, ఆమె లేని లోటు మనకు స్పష్టంగా తెలుస్తుంది.

NTR: ఎన్టీఆరే కాదు తారక్ ఫ్యాన్స్ కూడా సెన్సేషనే.. ఎందుకలా అంటారా?

Exit mobile version