Cold Wave:పెరిగిన చలి తీవ్రత – ఏడేళ్లలో ఎన్నడూ లేనంత చలి ఉంటుందా?

Cold Wave: తెలంగాణలో శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రతలు చాలా జిల్లాల్లో 20 డిగ్రీల సెల్సియస్ లోపే నమోదయ్యాయి.

Cold Wave

తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, ముఖ్యంగా ఏపీలో ‘మొంథా’ తుపాను కారణంగా ఏర్పడిన తీవ్రత తగ్గుముఖం పట్టడంతో, ప్రజలు ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి మళ్లుతున్నారు. అయితే వాతావరణంలో అనూహ్య మార్పు వచ్చి, చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది.

ప్రస్తుతం సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు వీచడం ప్రారంభమవుతున్నాయి. ఇక ఉదయం వేళల్లో పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. దాదాపు ఉదయం 9 గంటల వరకు చలి ప్రజలను గజగజా వణికిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా చలి ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్రంలో అతి ఉత్తరాన ఉన్న ఆదిలాబాద్ నుంచి మొదలుకొని, కిందున్న జోగులాంబ గద్వాల్ జిల్లా వరకు చలి సాధారణం కన్నా ఎక్కువగా ఉంది.

Cold wave

వాతావరణ నిపుణులు,వాతావరణ శాఖ అధికారులు అందించిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది చలి తీవ్రత ముఖ్యంగా తెలంగాణలో గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాబోయే 15 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులే (Dry Weather Conditions) కొనసాగే అవకాశం ఉంది.

తెలంగాణలో శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రతలు చాలా జిల్లాల్లో 20 డిగ్రీల సెల్సియస్ లోపే నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాలలో అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు కూడా రికార్డు అయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో కూడా చలి తీవ్రత బాగా పెరిగింది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం (Fog) కనిపిస్తోంది. నగరం పరిధిలోని శంకర్ పల్లి ప్రాంతంలో అత్యల్పంగా 14.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

వాతావరణ శాఖ అధికారులు రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. రాత్రి , ఉదయం వేళల్లో బయటకు వచ్చేవారు చలి నుంచి తగిన రక్షణ చర్యలు పాటించాలని సూచిస్తున్నారు.

చలిని తట్టుకునేందుకు స్వెటర్లు, జాకెట్లు, మఫ్లర్లు వంటి వెచ్చని దుస్తులను తప్పనిసరిగా ధరించాలి. శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేందుకు గోరువెచ్చని నీరు (Warm Water), వేడి సూప్‌లు, మరియు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

వృద్ధులు, చిన్న పిల్లలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప, చలి తీవ్రత అధికంగా ఉండే రాత్రి, తెల్లవారు జామున సమయాల్లో బయటకు వెళ్లడం మానుకోవాలి.ఒకవేళ రాత్రి లేదా ఉదయం వేళల్లో తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే, చిన్నారులు వృద్ధులు అదనపు దుస్తులతో సహా తగినన్ని రక్షణ చర్యలు తీసుకోవడం అవసరం అని అధికారులు, డాక్టర్లు చెబుతున్నారు.

వాతావరణ శాఖ యొక్క ఈ హెచ్చరికలతో, రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలి ప్రభావం మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version