TVK Vijay
మరో రెండు నెలల్లో తమిళనాడు ఎన్నికలు జరగబోతుండగా.. అధికార డీఎంకే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలగా ఉంటే, అన్నాడీఎంకే ఈ సారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ సారి తమిళనాట త్రిముఖ పోటీ ఖాయమైంది. హీరోగా తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న టీవీకే విజయ్(TVK Vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే ఈ ట్రయాంగిల్ ఫైట్ కారణం.
టీవీకే విజయ్(TVK Vijay) ఎంట్రీతో తమిళ పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. అయితే ఎంజీఆర్ తరహాలో విజయ్ చరిత్ర సృష్టిస్తాడని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు. దీనికి తగ్గట్టే విజయ్ కూడా ఒంటరి పోరుకే మొగ్గుచూపుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక విధంగా చెప్పాలంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ పొత్తులతో వెళితే సక్సెస్ అవ్వొచ్చని కొందరు, లేదు ఒంటరిగా పోటీ చేయాలని మరికొందరు, అసలు విజయ్ ప్రభావం ఉండదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇండియా టుడే- సీ ఓటర్ తమిళనాడు లోక్ సభ స్థానాలపై సర్వే నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించింది. ఇప్పటికిప్పుడు తమిళనాట ఎన్నికలు జరిగితే ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని పేర్కొంది. మొత్తం 39 స్థానాలకు గానూ 38 స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది. అసలు కనీస పోటీ కూడా లేకుండా విజయం సాధిస్తుందని అంచనాను వెల్లడించింది. ప్రస్తుతం తమళ ఓటర్ల నాడి పూర్తిగా అధికార పక్షం వైపే మొగ్గుచూపుతోందంటూ తెలిపింది.
హీరో విజయ్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపదని, టీవీకే ఒంటరిగా పోటీ చేస్తే నష్టపోతుందని సర్వే తేల్చేసింది. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదని చెప్పిన ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే అసెంబ్లీ స్థానాల్లోనూ డీఎంకేదే పైచేయిగా నిలుస్తుందని స్పష్టం చేసింది. విజయ్ కు అభిమానుల్లో ఆదరణ ఎక్కువగానే ఉన్నప్పటకీ అధికారం చేపట్టేందుకు మాత్రం సరిపోదని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
మహిళల్లోనూ ఆయనకు మంచి మద్ధతే లభించే అవకాశం ఉందని, విజయ్ కాంత్ కంటే మెరుగైన ఫలితాలు అందుకుంటారని చెబుతున్నారు. అయితే ఎంజీఆర్, ఎన్టీఆర్ తరహాలో మాత్రం విజయ్ ప్రభావం చూపించలేరని తేల్చేస్తున్నారు. అయితే విజయ్ టీవీకే పార్టీ వర్గాలు మాత్రం ఈ సర్వేను కొట్టిపారేస్తున్నాయి. ఇది అసలైన సర్వే కాదని, తమ పార్టీని మానసికంగా దెబ్బతీసే క్రమంలో ఇలాంటి సర్వేలు చేయిస్తున్నారంటూ మండిపడుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట చక్రం తిప్పబోయేది దళపతే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు ఇండియా టీవీ సర్వేను ఎన్డీఏ కూటమి సీరియస్ గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. ఏఐడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి టీవీకే పార్టీతో పొత్తు కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి విజయ్ పార్టీతో పొత్తుపై ఎన్డీఏ కూటమి మొదటి నుంచీ సానుకూలంగానే ఉంది. కానీ విజయ్ మాత్రం ఒంటరి పోరుకే ఆసక్తిగా ఉన్నారు.
అయితే క్షేత్రస్థాయిలో పలు చోట్ల అంతర్గత సర్వే నిర్వహించిన ఏఐడీఎంకే విజయ్ పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు తమ ఓటును కూడా చీల్చడం ఖాయమని అర్థం చేసుకున్నారు. ఈ కారణంగానే పొత్తు కోసం మొదటి నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పొత్తులతో వెళితే మంచి ఫలితాలు సాధిస్తామన్న నమ్మకంతో పళనిస్వామి కనిపిస్తున్నప్పటకీ విజయ్ మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు. మరి తాజా సర్వేతోనైనా దళపతి మనసు మార్చుకుంటాడేమో చూడాలి.
