iPhone 17
ఐఫోన్ అంటేనే ఒక క్రేజ్. దానికంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఐఫోన్ కొత్త మోడల్, అది కూడా ఐఫోన్ 17(iPhone 17) మన భారతదేశంలోనే తయారవుతుందంటే ఐఫోన్ లవర్స్ కు ఇంతకుమించిన పండుగ ఇంకేముంటుంది? ఇది కేవలం ఒక వార్త కాదు, మన దేశానికి, మన యువతకు ఇది ఒక సరికొత్త మైలురాయి.
తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం, ఐఫోన్ 17 (iPhone 17) మోడల్‌ను భారతదేశంలోనే తయారు చేసి, ప్రపంచ మార్కెట్లలో విడుదల చేయనున్నారు. ఇది గ్లోబల్ మొబైల్ తయారీ రంగంలో భారత్ స్థానాన్ని ఎంతో బలోపేతం చేస్తుంది.
కొన్ని సంవత్సరాలుగా యాపిల్ కంపెనీ భారతదేశంలో తమ తయారీ కేంద్రాలను విస్తరిస్తోంది. ఇది వారి దీర్ఘకాలిక వ్యూహంలో భాగం. ప్రస్తుతం, చెన్నై, తెలంగాణలోని బండ్లగూడ వంటి ప్రాంతాల్లో ఉన్న ప్లాంట్లలో ఈ తయారీ జరగనుంది. ఇక్కడే ఐఫోన్ 17 అసెంబ్లీ, తుది మెరుగులు దిద్దే పనులు పూర్తి చేస్తారు. స్థానికంగానే విడిభాగాలు సరఫరా కావడం వల్ల ఉత్పత్తి ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది.
భారత్‌కు లాభం.. ఐఫోన్ (iPhone 17) లవర్స్‌కు ఆనందం..
ఈ కీలక నిర్ణయం లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. పరిశ్రమలో నైపుణ్యం పెరిగి, ఇతర రంగాల్లో కూడా పోటీతత్వం పెరుగుతుంది.
భారీ స్థాయిలో ఎగుమతులు పెరిగి, మన దేశ జీడీపీపై సానుకూల ప్రభావం చూపుతుంది.
“మేడ్ ఇన్ ఇండియా” ట్యాగ్‌తో ఐఫోన్ మార్కెట్లోకి వస్తే, మన దేశీయ బ్రాండ్ విలువ ప్రపంచస్థాయిలో మరింత పెరుగుతుంది. ఒక గ్లోబల్ ప్రొడక్ట్ మన దేశంలో తయారవుతుందన్న గర్వం మనందరిలో కలుగుతుంది.
ఐఫోన్ 17తో మొదలై, భవిష్యత్తులో యాపిల్ వాచెస్, ఎయిర్‌పాడ్స్ వంటి ఇతర ఉత్పత్తులు కూడా భారతదేశంలోనే తయారయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలు భారత యువతకు ఉద్యోగాలతో పాటు, టెక్నాలజీ నైపుణ్యాన్ని అందించి, దేశ అభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తాయి. ఇది యాపిల్ వంటి గ్లోబల్ కంపెనీలకు భారతదేశం ఒక నమ్మకమైన భాగస్వామిగా మారేందుకు ఒక మంచి సంకేతంగా భావిస్తున్నారు ఆర్ధిక నిపుణులు.